అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలను పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసిపి 151 సీట్ల అఖండ మెజారిటి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే బంపర్ మెజారిటితో పార్టీ అధికారంలోకి వచ్చిందో వెంటనే కొందరు టిడిపి నేతలు వైసిపిలో చేరుతున్నారు.

 

ఇక్కడే కార్యకర్తల్లో చాలామంది జగన్ నిర్ణయంపై మండిపోతున్నారు. తాము ఎవరి మీదైతే పోరాటం చేశారో అటువంటి వాళ్ళందరినీ జగన్ ఇపుడు పార్టీలో చేర్చుకోవటాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా జూపూడి ప్రభాకర్ వైసిపిలో చేరటాన్ని కొందరు నేతలు,  కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

తాము ఎవరినైతే వ్యతిరేకించి పోరాటం చేశామో ఇపుడు వారినే పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తే తమ పోరాటాలకు అర్ధమేంటి ? అంటూ తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. గతంలో వైఎస్ కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిని, వ్యక్తిగతంగా వారిపై సోషల్ మీడియాలో విషం చిమ్మిన వారిని పార్టీలోకి చేర్చుకుని నెత్తిన పెట్టుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

చంద్రబాబునాయుడు అరాచకపాలనపై తాము చేసిన పోరాటాలన్ని వృధా అయినట్లు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వైసిపిలో ఉన్నంత కాలం జగన్ దగ్గర అన్ని విధాల ప్రాధాన్యత పొందిన తర్వాత కూడా జూపూడి లాంటి వాళ్ళు టిడిపిలో చేరటాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. టిడిపిలోకి వెళ్ళగానే జగన్ ను నోటికొచ్చినట్లు తిట్టి మళ్ళీ వైసిపిలో చేరటాన్నే తట్టుకోలేకపోతున్నారు.

 

ఇపుడు వైసిపిలో చేరుతున్న వాళ్ళ వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేకపోయినా వాళ్ళను చేర్చుకోవటంలోని ఔచిత్యాన్ని నేరుగా జగన్నే  ప్రశ్నిస్తున్నారు.  ఆమధ్య అనకాపల్లి ఎంపిగా టిడిపి తరపున పోటి చేసిన అడారి ఆనంద్ కుమార్ కూడా వైసిపిలో చేరారు. ఆయన తండ్రి తులసీరావు మాత్రం టిడిపిలోనే ఉన్నారు. ఇపుడు జూపూడి కూడా వైసిపిలో చేరారు.

 

మొన్నటి ఎన్నికల్లో  టిడిపి అధికారంలోకి వచ్చుంటే వాళ్ళంతా ఇంకా టిడిపిలోనే కంటిన్యు అయ్యేవారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇపుడు పార్టీలోకి వస్తున్న వాళ్ళంతా ఏదో ఆశించే చేరుతున్నారన విషయంలో ఎవరికీ సందేహం లేదు. ఇక్కడే జగన్ నిర్ణయాన్ని కొందరు నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

పనిలో పనిగా వర్ల రామయ్య, కింజరాపు అచ్చెన్నాయుడు, జేసి బ్రదర్స్, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళను కూడా వైసిపిలో చేర్చుకుంటే సరిపోతుందని సెటైర్లు కూడా వేస్తున్నారు. మరి కార్యకర్తల ఆవేధన జగన్ దాకా వెళుతుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: