తెలుగుదేశంపార్టీలో చంద్రబాబునాయుడు సీన్ దాదాపు అయిపోవచ్చింది. ఆ విషయం చంద్రబాబుకు కూడా స్పష్టంగా అర్ధమైపోతోంది. ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి లేస్తే మనిషిని కాను అన్నట్లుగా నెట్టుకొచ్చారు. ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారో అప్పటి నుండే చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయి.

 

ఒకవైపు ఎన్నికల్లో ఘోర ఓటమి. మరో వైపు పార్టీకి రాజీనామా చేస్తున్న నేతలు. మరోవైపు రాజకీయంగా అందిరాని సుద్దపప్పులాంటి పుత్రరత్నం నారా లోకేష్. చివరగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హామీల అమలుకు కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డి. ఇన్నింటి మధ్య చంద్రబాబుకు టెన్షన్ పెరిగిపోతోంది.

 

మామూలుగా ఎవరు అధికారంలోకి వచ్చినా తామిచ్చిన హామీల అమలుకు కొంత గ్యాప్ తీసుకోవటం సహజం. కానీ జగన్ మాత్రం గద్దెనిక్కిన మరుసటి రోజు నుండి పాదయాత్రలో కానీ మ్యానిఫెస్టోలో కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలోనే బిజీగా ఉంటున్నారు. కొన్ని పథకాల అమలుకు శ్రీకారం  చుట్టారు. మరికొన్ని పథకాల అమలుకు టైం టేబుల్ ప్రకటించేశారు.

 

పథకాలను ఎప్పటి నుండి అమల్లోకి తెస్తున్నామనే విషయాన్ని ఓ టైంటేబుల్ ద్వారా ప్రకటించటమంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకూ బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలోను ఇలా చేసినట్లు కనిపించలేదు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో కన్నా జగన్ కు ఇపుడు సానుకూలత మరింత పెరిగిందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

 

జగన్ విషయంలో జనాల సానుకూలత పెరిగింది లేంది తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలే సాక్ష్యాలుగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. సరే ఆ ఫలితాలు ఎలాగున్నా టిడిపిలో చంద్రబాబు పట్టు కోల్పోయారన్నది మాత్రం వాస్తవం.  జగన్ ప్రభుత్వంపై ఆందోళనలు చేయాలన్న చంద్రబాబు పిలుపును సీనియర్ నేతలెవరూ పట్టించుకోలేదు.

 

అలాగే కరకట్ట మీద అక్రమ నివాసం విషయంలో కూడా ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలిన వాళ్ళు పట్టించుకోలేదు. ఇక చలో ఆత్మకూరు లాంటి విషయాల్లో చంద్రబాబు ఇద్దరు, ముగ్గురు నేతలతో మాత్రమే డ్రామా నడిపించారు. అంటే చాలామంది నేతలు చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోవటం లేదని అర్ధమైపోతోంది. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా గ్రహించారు. దీంతోనే పార్టీలో చంద్రబాబుకు సీన్ లేదనేది అర్ధమైపోయింది. స్ధానిక సంస్ధల ఎన్నికలతో ఆ విషయమై మరింత క్లారిటి రావటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: