ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మె మ‌లుపులు తిరుగుతోంది. ఆర్టీసీ సమ్మెపై రాష్ట్రప్రభుత్వ అణచివేత ధోరణి నేప‌థ్యంలో కార్మికులు ప్ర‌త్యామ్నాయాలు చూస్తున్నారు. ఇందిరాపార్కు వద్ద దీక్షలు చేపట్టకుండా పోలీసులు అర్ధరాత్రి అనుమతి నిరాకరించినందున గవర్నర్‌ శ్రీమతి తమిళసై సౌందర్‌రాజన్‌కు వివరించాలని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు యోచిస్తున్నారు.  గవర్నర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇప్పటికే మద్దతు తెలిపిన రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు కూడా గవర్నర్‌ను కలవాలని సూచించాయి. అలాగే కేంద్రమంత్రుల్ని కూడా కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై ఒక‌ట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. 


మ‌రోవైపు, టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ద‌క్కుతోంది. తెలంగాణ పబ్లిక్‌, ప్రయివేటు రోడ్డు ట్రాన్స్‌పోర్టు ఫెడరేషన్‌(ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌)  తాజాగా పూర్తి మద్దతిస్తున్నట్టు ప్ర‌క‌టించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ, ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్మికులు నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు, ప్రదర్శనలు చేయాలని ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు.


మ‌రోవైపు, ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చిన సీపీఐ...తాజాగా ఆర్టీసీ స‌మ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.  హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. 729 మందిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. సమ్మె కార్మికుల హక్కు అని అన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమనీ, కార్మికులు కాదన్నారు. రాయితీల డబ్బును ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఏపీలో ఆర్టీసీ విలీనమైందని గుర్తు చేశారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోవద్దని కోరారు. 2013లో ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆర్టీసీ విలీనంపై ఉత్తర్వులు వెలువడ్డాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినందున ఆ ఉత్తర్వులు అమలు కాలేదన్నారు.  బతుకమ్మ, దసరా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసీఆర్‌ చొరవ చూపాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ విలీనం అన్నది కొత్త డిమాండ్‌ కాదన్నారు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ తరహాలో రవాణా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: