పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అన్నాడు వెనకటికి ఓ సినీ కవి. పెళ్ళి అయితే పిల్లా పాపలతో పచ్చగా వందేళ్ళ కాపురం సాగుతుందన్నది కవి భావన. రాను రాను పెళ్ళి మీద మోజు తగ్గుతున్న‌ యువత ఓ వైపు ఉంది. మరో వైపు ఇంకా పెళ్ళి కానీ మధ్యవయస్కుల సంఖ్య కూడా దారుణంగా పెరిగిపోతోంది. ఎంత ఆధునిక భావాలు ఉన్నా కూడా ఎపుడో ఒకపుడు పెళ్ళి చేసుకోవాలి అన్న ఆలోచన మాత్రం భారతీయ యువతలో ఉండడంతో పెళ్ళి కావాలంటూ  ఆశ్రయిస్తున్న కొందరు దారుణంగా మోసపోతూంటే బ్రోకర్లకు అది  బంగారు పంట అవుతోంది.


అందుకే ఆన్ లైన్, ఆఫ్ లైన్ వేదికగా పుట్ట గొడుగులు మాదిరిగా మ్యారేజ్ బ్యూరోలు పుట్టుకొస్తున్నాయి. మీ పెళ్ళి మేము చేస్తాం, ఆ పూచీ మాదీ అంటూ మ్యారేజ్ బ్యూరోలు ఇస్తున్న హామీలు, చేస్తున్న ఆకర్షణీయమైన ప్రకటనలకు యువత బలి అవుతోంది. పెళ్ళి చేస్తామంటూనే బతుకులో మంట పెడుతున్నారట. బంగారం లాంటి జీవితాలను  బుగ్గిపాలు చేస్తున్నారుట. అందరూ కాదు కానీ చాలా మారేజ్ బ్యూరోలు అభ్యర్ధుల‌ బలహీనతలను ఆసరాగా చేసుకుని పెళ్ళి పేరిట భారీ మోసాలకు తెర తీస్తున్నాయట.


దీంతో పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు, వేయేళ్ళ మంట, తంటా అంటున్నారు మోసపోయిన బాధితులు. ఇంతకీ ఈ మోసాలు ఎలా ఉంటున్నాయంటే ఆన్ లైన మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తున్న వారు అడ్డంగా బుక్ అవుతున్నారట. ఈ సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్ళు మోసాలు చేస్తున్నారని పోలీసుల వద్ద పెరుగుతున్న కేసుల వివరాలే చెబుతుననాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులను టార్గెట్ గా చేసుకుని పెళ్ళి చేసుకుంటామని నమ్మించి మోసం చేస్తున్నారుట.


అనేకమైన కబుర్లు, అందమైన హామీలతో బుట్టలో వేసుకుని నమ్మించి గొంతు కోస్తున్నారుట. ఆన్ లైన్ మ్యాట్రిమోనీల వల్ల ఆర్దికంగా, మానసికంగా మోసపోతున్న కేసులు ఇపుడు  కుప్పలు తెప్పలుగా పోలీసులకు వచ్చి చేరుతున్నాయట. దీంతో తెలంగాణా పోలీసులు జనాలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండని  కూడా సూచిస్తున్నారు. పెళ్ళి చేసుకోవడం కోసం ఆన్ లైన్ మ్యాట్రిమోని సైట్లను ఆశ్రయిస్తున్న వారు ఇకపైన జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారుట.



మరింత సమాచారం తెలుసుకోండి: