ఏ పార్టీకయినా అధికారంలోకి వచ్చిన తర్వాతే సమస్యలు మొదలవుతాయి. ఇపుడు వైసిపి పరిస్ధితి కూడా అలాగే తయారైంది. ఇపుడు రెండు సమస్యలతో వైసిపికి ఇబ్బందులు మొదలైనట్లే కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం నేతలు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే అఖండ మెజారిటితో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిందో వెంటనే సమస్యలు మొదలయ్యాయి.

 

అధికారంలోకి రాగానే ఎదురైన మొదటి సమస్య ఏమిటంటే ఎంఎల్ఏలు, నేతల మధ్య ఆధిపత్య పోరు. ఇక రెండో సమస్య ఏమిటంటే వైసిపి నుండి టిడిపిలోకి వెళ్ళిపోయిన నేతలు తిరిగి   పార్టీలోకి తిరిగి వస్తుండటం. నిజానికి విడివిడిగా చూస్తే రెండు చిన్న సమస్యలుగానే కనిపిస్తాయి కానీ కలిపి చూస్తే పెద్దదే అవుతుంది.

 

ఎంఎల్ఏల మధ్య ఆధిపత్య పోరు నెల్లూరు జిల్లాలో మొదలైంది. నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి-సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య మొదలైన ఆధిపత్య పోరు చివరకు పార్టీ ఇమేజిని బజారున పడేసింది. ఎంపిడివో విషయంలో కోటంరెడ్డికి గొడవ జరిగింది. ఎంపిడివో సరళకు కాకాణి మద్దతుగా నిలవటంతో ఆమె కోటంరెడ్డిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 

ఎప్పుడైతే ఎంపిడివో కేసు పెట్టారో వెంటనే టిడిపి మీడియా దాన్ని పెద్దదిగా చేసేసింది. దాంతో విషయం కాస్త పెద్దదైపోయి చివరకు కోటంరెడ్డి అరెస్టుకు దారితీసింది.

 

ఇక చేరికల గురించి చెప్పుకుంటే వైసిపిలో నుండి టిడిపిలో చేరిన తర్వాత జూపూడి ప్రభాకర్ జగన్ ను ఎంతగా తిట్టింది అందరకీ తెలిసిందే. మోకాలికి బోడిగుండుకు ముడేసి ప్రతి విషయాన్ని జగన్ కు ముడేసి మరీ తిట్టేవారు. అలాంటి జూపూడిని జగన్ మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. నిజానికి జూపూడి రీ ఎంట్రీ వైసిపిలో ఎవరికీ ఇష్టం లేదు.

 

అయినా జాయినింగ్ జగన్ స్ధాయిలో డిసైడ్ జరిగిపోయింది కాబట్టి ఎవరు బహిరంగంగా నోరెత్తటం లేదు. ఇటువంటి చేరికలు కానీ లేదా ఆధిపత్య పోరు మరో రెండు జిల్లాల్లో గనుక బయటపడితే జగన్ కు ఇబ్బందులు తప్పవనే అనుకోవాలి. మరి  ఈ విషయాలపై జగన్ ఎప్పుడు దృష్టి పెడతారో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: