తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సెగ రాజకీయ పక్షాలకు తాకింది. దీనితో రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలుస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో ఆయా పక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఇందులో భాగంగానే నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశంలో చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగుతోంది. నేడు కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ససేమిరా అనగా, మరోవైపు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.


ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌పై నేడు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం, భవిష్యత్ పోరాటంపై చర్చించనున్నారు. మరోవైపు, ఐదో రోజు కూడా బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందితో పాక్షికంగా బస్సులు నడుపుతోంది. ఈ నేపథ్యంలో కార్మిక  నేతలు రహస్య ఎజెండాతో పని చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. 



ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై మంత్రి మాట్లాడుతూ.. ఆందోళన చేస్తున్నాం కాబట్టి డిమాండ్లు నెరవేర్చాలనడం సహేతుకం కాదు. ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కిన చెట్టును నరుక్కుంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతానికి సంబంధించినది. కేంద్రం దృష్టికి ప్రజల ఆకాంక్షను తెలిపేందుకు అప్పుడు ఉద్యమం చేశామని మంత్రి  ఈ సందర్బంగా ప్రస్తావించారు . ప్రతిపక్ష పార్టీలు పూటకో మాట మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడ చేసిన డిమాండ్లను అమలు చేసే దమ్ముందా అని సూటిగా ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను అమలు చేయాలనడం అవివేకమన్నారు. ఆర్టీసీ కార్మిక నేతలు రహస్య ఎజెండాతో పని చేస్తున్నారు. కార్మికులు వారి ఉచ్చులో పడొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని' మంత్రి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: