ఆంధ్రప్రదేశ్... తెలంగాణలో కుంభవృష్టి కురుస్తోంది. హైదరాబాద్‌లో పండుగ  నాడు వర్షం బీభత్సం సృష్టించింది. అటు...ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాలకు పిడుగుపడి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దసరా పండుగ  రోజున పిడుగుపాటు మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. భారీ వర్షాలకు జూరాల, శ్రీశైలం, సాగర్ మరోసారి పూర్తిస్థాయికి చేరుకున్నాయి. 


తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో మరోసారి వాన దంచికొట్టింది. కొద్దిపాటి వర్షానికే రహదారులన్నీ జలమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌  అయ్యింది. దసరా పండుగకు జనం సొంతూళ్లకు వెళ్లటంతో కొంతమేరకు ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. అయితే రోడ్లు చెరువులను తలపించాయి. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు.


ఇక...భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా ముదిగొండలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు.  ముదిగొండ ఎస్సీ కాలనీకి చెందిన ఇరుగు శ్రీను, బలంతు ప్రవీణ్‌, జి.నవీన్‌తో పాటు ఉసికెల గోపి నలుగురు స్నేహితులు సెలవు రోజు కావడంతో సరదాగా గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఆ సమయంలో భారీ ఉరుములు మెరుపులతో వర్షం పడటంతో వారు ఓ చెట్టు కిందికి  చేరుకున్నారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందగా...గోపి అపస్మారక  స్థితిలోకి వెళ్లాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. 


కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఏపీ...  తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళను  సంతరించుకున్నాయి. పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. జూరాలకు వరద ప్రవాహం మరింత  పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు... శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద పోటెత్తింది. జూరాల నుంచి శ్రీశైలానికి లక్షా పదివేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: