విశాఖ ఏజెన్సీలో వర్ష బీభత్సం గిరిజనుల జీవితాల్లో అంధకారం నింపింది. పదుల సంఖ్యలో గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు మన్యంలో వరదలు పొంగిపొర్లాయి. వర్షానికి చెట్లు విరిగిపడటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లంబసింగి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులు కొట్టుకుపోవటం.. కొండవాగులు పొంగుతుండటంతో గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు. 


విశాఖ జిల్లా ఏజెన్సీలో వరద కష్టాలు గిరిజనుల జీవితాలను దుర్భరంగా మార్చేశాయి. నిత్యావసరాల కోసం గిరిజనులు ఏకంగా ప్రాణాలకే తెగించాల్సి వస్తోంది. జి.మాడుగుల మండలంలో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఫలితంగా మందులు కావాలన్నా గిరిజన గ్రామాలకు కష్టాలు తప్పడం లేదు. కిల్లంకోట దగ్గర కొందరు యువకులు వరదను దాటేందుకు చేసిన సాహసకృత్యం అక్కడ జీవన స్థితిగతులకు అద్దంపడుతోంది. తరాలుగా వర్షాకాలంలో ఈ కష్టాలు అలవాటే అయినా తమ జీవితాలు మారేది ఎప్పుడంటూ గిరిపుత్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.


విశాఖ ఏజెన్సీలో పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లంబంగి ఘాట్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డు మీద పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడినప్పడు ప్రయాణం చేయాలంటేనే గిరిజనవాసులు వణికిపోతున్నారు. మరోవైపు వర్షానికి రోడ్లపైనే చెట్లు విరిగిపడ్డాయి. అటుఇటు వెళ్లడానికి లేకుండా రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో...ఆర్టీసీ బస్సులు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణీకులే కిందికి దిగి చెట్లను పక్కకు తీసివేసే ప్రయత్నం చేశారు. సుమారు గంటపాటు వాహనాలతో పాటు జనం రోడ్డుపైనే ఉండిపోయారు.


ఇక...అదే సమయంలో లంబసింగి ఘాట్ రోడ్డు దిగువలో సమ్మగిరి వెళ్లే రహదారిపై కొండవాగుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద ఉప్పొంగి ప్రవహించడంతో..వంతెన మునిగిపోయింది. లంబసింగి ఘాట్‌ రోడ్డు ఒడిశా, ఛత్తీస్ ఘఢ్, తెలంగాణకు వెళ్లే రహదారి కావడంతో  నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు మాత్రం ఇక్కడ రాకపోకలు నిలిచిపోతున్నాయి. 


మొత్తానికి...విశాఖ మన్యాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులు కొట్టుకుపోవడంతో విశాఖ ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరుణుడు శాంతిస్తే తప్పా...విశాఖ మన్యంలో గిరిజనుల జీవితాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపించటంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: