పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ప్రపంచ దేశాల్లో ఇంపార్టెన్స్ తగ్గిపోయిందా? చైనా పర్యటనకు ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఇమ్రాన్ ఒక్కరే ఎందుకు వెళ్లలేదు?  చివరి 24 గంటల్లో ఇమ్రాన్ బృందంలో ఆర్మీ చీఫ్‌తో పాటు మంత్రులు ఎందుకు కలిశారు? పాక్ సైన్యాధ్యక్షుడు ప్రధానితో కలిసి చైనాతో చర్చలు జరపటం వెనుక మతలబు ఏమైనా ఉందా? అసలు...పాకిస్థాన్...చైనా దేశాల మధ్య ఎలాంటి స్నేహ సంబంధాలు ఉన్నాయ్?


పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చైనాలో పర్యటిస్తున్నారు. నిన్న ప్రత్యేక విమానంలో ఆయన చైనాకు చేరుకున్నారు. ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి ఇమ్రాన్‌కు స్వాగతం పలికారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకొంది. పర్యటనకు ముందు వరకు ఇమ్రాన్‌ సహా కొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ఈ బృందంలో ఉన్నారు. కానీ చివరి 24 గంటల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని సహా అనేక మంది మంత్రులు ముఖ్యంగా ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వానిని బృందంలో చేర్చారు. పైగా ఇమ్రాన్‌ అక్కడికి చేరుకోవడానికి ముందే బజ్వా చైనాకు వెళ్లి అక్కడి సైనికాధికారులతో చర్చలు చేపట్టారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఇమ్రాన్‌ భేటీ సమయంలో బజ్వా కూడా అక్కడే ఉండనున్నారు.  ఒక దేశ సైన్యాధ్యక్షుడు ప్రధానితో కలిసి చర్చల్లో పాల్గొనడం చాలా అరుదు. కానీ బజ్వా పాక్‌  విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పైగా చివరి క్షణంలో బజ్వాని పర్యటన బృందంలో చేర్చడం.. చైనా దాన్ని అనుమతించడాన్ని బట్టి చూస్తే ఆయన పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోంది.   


కశ్మీర్‌పై మద్దతు కూడగట్టడంలో ఇమ్రాన్‌ దారుణంగా విఫలమయ్యారు. మాకెవరూ మద్దతివ్వడం లేదంటూ ఐక్యరాజ్యసమితి వేదికగానే ప్రకటించారు. ఇది పాక్‌ వైఫల్యానికి నిదర్శనంగా ప్రపంచ దేశాలు పరిగణించాయి. దీంతో ఇమ్రాన్‌ వల్లకాదని భావించి ఆర్మీనే స్వయంగా రంగంలోకి దిగినట్లు అర్థవుతోంది. ఇమ్రాన్ అదే మూస పద్ధతిని అనుసరిస్తే.. పాక్‌కు ఎఫ్‌ఏటీఎఫ్‌ బ్లాక్‌లిస్ట్‌ ముప్పు తప్పదేమోనని భావించినట్లున్నారు. అందుకే చైనాను సంతృప్తిపరిచి మద్దతు కూడగట్టేందుకు బజ్వా రంగంలోకి దిగారు.  చైనా సైతం ఇమ్రాన్‌తో సమానంగా బజ్వాకు ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే ఇరు దేశాల మధ్య కీలకంగా ఉన్న చైనా, పాకిస్థాన్‌ కారిడార్‌తో సంబంధం ఉన్న దాదాపు అన్ని మంత్రిత్వ శాఖల మంత్రులను పర్యటనకు ఆహ్వానించింది. ఒకరోజు ముందే చైనా చేరుకున్న ఆర్మీ చీఫ్‌ బజ్వా.. ప్రధాని ఇమ్రాన్‌ వచ్చే సమయానికి అన్ని ఒప్పందాలు, కీలక విషయాలపై చర్చలు జరపడం విశేషం. 


మొత్తానికి...పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...చైనాతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాని చైనాకు ఆహ్వానించటాన్ని మాత్రం మిగిలిన ప్రపంచ దేశాలన్నీ నిశితంగా గమనిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: