కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రక్తం చిందింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేలాది మంది కర్రలతో దేవరగట్టుకు చేరుకున్నారు. సంప్రదాయంగా చేపట్టిన జైత్రయాత్రలో 60 మందికి పైగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


కర్నూలు జిల్లాలో దసరా ఉత్సవాలు అంటే మొదట గుర్తు వచ్చేది దేవరగట్టు కర్రల సమరం. పండుగ అంటే కొత్త బట్టలు వేసుకొని పిండివంటలు చేసుకొని కుటుంబమంతా సరదాగా గడపడమే అనుకుంటాం. కానీ దసరా సందర్బంగా  దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి ఉత్సవాల్లో రక్తం చిందాల్సిందే. హోలగుంద మండలంలో నెరనికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు  ప్రత్యేక పూజలు చేసి  మాల మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవానికి వేల సంఖ్యలో చేరుకున్నారు. చిమ్మ చీకట్లో కాగితాలు, కర్రలు చేతబట్టుకొని ఆయా గ్రామాల నుంచి దేవరగట్టుకు చేరుకున్నారు. అప్పటికే ఉత్సవాలను చూసేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి లక్షకు పైగా జనం వచ్చి ఉత్కంఠతతో చూశారు.  


దేవరగట్టులో మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. ఆ తరువాత జైత్రయాత్రగా కొండపైనుంచి కిందికి వచ్చి కర్రల సమరంలో పాల్గొన్నారు. ఒళ్ళు గగుర్పొడిచే విధంగా వేలాది కర్రలు తలలపై నాట్యమాడాయి. మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు నెరనికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు పోటీపడ్డారు. ఒకవైపు తొక్కిసలాట, మరోవైపు భక్తి పేరుతో సాగుతున్న బన్నీ ఉత్సవంలో రక్తమోడింది. అయినా సరే కర్రలు పట్టినవారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. బండారుగా పిలిచే పసుపు రాసుకొని బహుపరక్ అంటూ బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఉత్సవం ప్రారంభానికి ముందే జరిగిన తొక్కిసలాటలో హెబ్బటం గ్రామానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. కర్రల సమరంలో సుమారు 60 మంది గాయపడ్డారు. ఒకరికి కాలు విరిగింది. ఇనుప రంగులు ఉన్న కర్రలు తగిలి కొందరు.. కాగడాల మంటలు తగిలి మరికొందరు వైద్య శిబిరంలో చికిత్స పొందారు. 


మాల మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర తర్వాత సంప్రదయం ప్రకారం జమ్మి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. జనం రక్తపడి వద్ద పిడికెడు రక్తం ఇచ్చారు. పూర్వం రాక్షసులను వధించిన మాల మలేశ్వరస్వామి రాక్షసుల కోరిక మేరకు ఏటా విజయదశమి రోజున పిడికెడు రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఆమేరకు పిడికెడు రక్తం రక్తపడి వద్ద ఇచ్చారు. ఆ తరువాత భవిష్యవాణి వినిపించారు. దేవరగట్టు బన్నీ ఉత్సవాల సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, బాడీ ఒన్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. 


దేవరగట్టు ఉత్సవాలకు గత ఏడాది కంటే జనం భారీ సంఖ్యలో వచ్చారు.  ఉత్సవాలకు రెండు వారాలు ముందుగా చైతన్య సదస్సులు నిర్వహించామనీ, అందుకే హింస తగ్గిందని పోలీసులు తెలిపారు. మొత్తానికి చిన్న చిన్న ఘటనలు మినహా ఉత్సవం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: