``ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తే.. రానున్న హ‌ర్యానా, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మా పార్టీ విజ‌యం సాధించ‌డం అసాధ్య‌మే `` ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదు...ప్ర‌ముఖ కాంగ్రెస్ నేత‌. పైగా ఆయ‌నేమీ....అల్లాట‌ప్పా చోటామోటా నాయ‌కుడు కాదు..కాంగ్రెస్ ప్ర‌ముఖుడు, గాంధీల కుటుంబానికి వీర‌విధేయుడు అనే పేరున్న వ్య‌క్తి. రెండు కీల‌క‌ రాష్ట్రాలు, పైగా బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాలు. అలాంటి చోట గెలుపు గురించి...పోలింగ్‌కు దాదాపు ప‌దిరోజుల ముందే...ఇలా కామెంట్లు చేయ‌డం స‌హ‌జంగానే...చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


సీనియ‌ర్‌నేత స‌ల్మాన్ కుర్షీద్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ...రాహుల్ గాంధీ పార్టీని వీడి వెళ్ల‌డం వ‌ల్ల కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని అన్నారు. ఈ ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింద‌ని, ఆ ఓట‌మి త‌ర్వాత అవ‌మాన భారంతో రాహుల్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని వ‌దిలేశార‌ని, దాంతో ఆ పార్టీ ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌న్నారు. పార్టీలో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తే.. రానున్న హ‌ర్యానా, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం అసాధ్య‌మే అని స‌ల్మాన్ కుర్షీద్ తెలిపారు. రాహుల్ మ‌ధ్య‌లోనే పార్టీని వ‌దిలివెళ్ల‌డం వ‌ల్ల ఆ పార్టీ మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌న్నారు. ``మేం ఎంత వేడుకున్నా.. రాహుల్ మాత్రం అధ్య‌క్ష హోదా నుంచి త‌ప్పుకున్నార‌ని, ఆయ‌న నిర్ణ‌యాన్ని గౌర‌విస్తున్నాం` అని అన్నారు. 


అయితే, పార్టీలో మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. విపాసన నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కాంబోడియా వెళ్లారన్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ ఆకస్మిక పర్యటన అనేక మందిని విస్మయపరుస్తున్నది. ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉండడమే కాకుండా, రాహుల్ టీం.. పార్టీలో టార్గెట్ అవుతున్నది. పార్టీలో ఉన్న చాలామంది జూనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్తుపై వారిలో అయోమయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు? ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాహుల్ సన్నిహిత నేతలు ప్రస్తుతం పార్టీలో సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం యువనేతల్లో అయోమయానికి కారణమవుతున్నది. అశోక్ తన్వర్, సంజయ్ నిరుపమ్, ప్రద్యుత్ దెబర్‌మాన్ తిరుగుబాటు పార్టీలో వృద్ధ నేతలు యువనేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారనే భావ‌న క‌లిగిస్తున్న స‌మ‌యంలో... రాహుల్ ఎందుకు ఇలా చేశార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: