మరి కొద్ది గంటల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ వస్తారన‌గానే మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు భారీ ట్విస్ట్ ఇచ్చారు. దాంతో తమ్ముళ్ళకు భారీ షాక్ తగిలింది. గంటా వైఖరి అర్ధం కాక తమ్ముళ్ళు తలపట్టుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు రాజకీయ పోకడలు ఎపుడూ ఎవరికీ అర్ధం కాని సంగతి విధితమే. ఆయన నాలుగు నెలల క్రితం విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.


గెలిచిన దగ్గర నుంచి గంటా టీడీపీ  పార్టీ ఆఫీస్ ముఖం చూడలేదని ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు గంటా ఇతర పార్టీలలోకి జంప్ చేస్తారని కూడా ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపధ్యంలో గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఒక్కసారిగా భారీ ట్విస్ట్ ఇచ్చేశారు. తాను టీడీపీని వీడడం లేదని చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు తన ఉత్తర నియోజకవర్గం పార్టీ ఆఫీస్ కి వచ్చి మరీ బాబు విశాఖ టూర్ ప్రొగ్రాం గురించి క్యాడర్ తో  చర్చించారు.


దాంతో గంటా టీడీపీలో ఉండరని భావించిన ప్రత్యర్ధి  పార్టీ వర్గాలు ఖంగు తిన్నాయి. విశాఖలో రెండవ గ్రూప్ నకు నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వర్గంలో కూడా పచ్చి వెలక్కాయ పడిందని అంటున్నారు. అర్బన్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రహమాన్ గంటా మనిషి. ఆయన స్వయంగా ఈ మీటింగుకు హాజరై చంద్రబాబు రాక సందర్భంగా పార్టీ బాధ్యతలు అన్నీ గంటాయే స్వయంగా చూస్తారని ప్రకటించడంతో పార్టీలో వైరి వర్గాలు భగ్గుమంటున్నాయి.


నాలుగు నెలలుగా పార్టీకి ముఖం చూపించని గంటా నాయకత్వం ఏంటని, ఆయన ఏ విధంగా బాబు విశాఖ టూర్ ని రివ్యూ చేస్తారని అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా గంటా తాను పార్టీ మారుతానని చెప్పలేదు కాబట్టి ఆయన టీడీపీవారేనని ఆయన వర్గం అంటోంది. మరో వైపు వైసీపీలో డోర్లు క్లోజ్ అయ్యాయి కాబట్టే గంటా ఈ వైపుగా వచ్చారని కూడా ఎకసెక్కం చేస్తోంది. ఏది ఏమైనా పార్టీకి రిపేర్లు చేయాలని వస్తున్న బాబు ముంది రెండు వర్గాల కుమ్ములాట ఇపుడు పెద్ద సమస్యగా మారుతోందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: