కేంద్రం పెద్దన్న పాత్ర ఇంకా అలాగే కొనసాగుతోంది. తాను చెప్పినట్లే వినాలన్న పంతంతో ముందుకు పోతోంది. సొంత పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాధ్ యోగి సైతం విద్యుతు కొనుగోళ్ళ ఒప్పందాలను రద్దు చేసుకుని కేంద్రానికి ఝలక్ ఇచ్చిన నేపధ్యం ఓ వైపు ఉంటే ఇదొక వైరస్ లా దేశంలోని ఇతర రాష్ట్రాలకు అంటుకుంటుందన్న కంగారు,  కలవరం బీజేపీ సర్కార్ లో  మరో వైపు కనిపిస్తోందని అంటున్నారు.


అందువల్లనే అర్జంట్ గా దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యుత్ మంత్రులతో కీలకమైన సమావేశాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 11, 12 తేదీలలో గుజరాత్ లో  జరిగే ఈ మీటింగ్ సారాంశం ఒక్కటేనని అంటున్నారు ప్రైవేట్ విద్యుత్తు ఒప్పందాలను అసలు సమీక్షించరాదు అన్నదే కేంద్ర విధానం అని కూడా అంటున్నారు. ఇలా చేయడం వల్ల విద్యుత్ సంస్థలకు నష్టం వస్తుందంట. దేశంలో పెట్టుబడులు పెట్టేవారు భయపడిపారిపోతారట.


బ్యాంకులు విద్యుత్తు సంస్థలకు రుణాలు ఇవ్వవట. ఇక దేశంలో అన్ని రకాలైన అనర్ధాలు జరిగిపోతాయట. ఈ రకమైన అజెండాతో కేంద్రం గుజరాత్ లో నిర్వహించబోయే రాష్ట్రాల విద్యుత్ మంత్రుల సమావేశంలో పెద్ద  క్లాస్ తీసుకుంటుందని అంటున్నారు. ఓ విధంగా ఈ మీటింగ్ ఏర్పాటు వెనక జగన్ ఉన్నారని అంటున్నారు. అజెండా కూడా జగన్ నిర్ణయాలమీదనే ఉండడం విశెషంగా చెప్పుకోవాలి.


విద్యుతు కొనుగోళ్ళ ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో సమీక్షించరాదని గట్టిగా కేంద్రం ఈ సమావేశం ద్వారా చెప్పబోతోందని అంటున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని కూడా చెప్పబోతున్నారు. ఒక పార్టీ అధికారంలో ఉన్నపుడు కుదుర్చుకున్న ఒప్పందాలు మరో పార్టీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయడం అసలు జరగకూడదని కూడా గట్టిగా ఈ సమవేశంలో చెప్పబోతున్నారు.


మరి దీనికి జగన్ సర్కార్లో విద్యుత్ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ విధంగా సమాధానం చెబుతారో, ఏపీ సర్కార్ విధానాలు ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి. ఒక వేళ కేంద్రం విధానాలపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పమంటే ఎన్ని జగన్ పాలసీని సమర్ధిస్తాయన్నది కూడా చూడాలి. మొత్తానికి కేంద్రం రాష్ట్ర మంత్రులతో ఏర్పాటు చేయబోయే విధ్యుత్ సమావేశం రాష్ట్రాలకు  భారీ షాకులు ఇచ్చేలా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: