జగన్ కి కేసీయార్ కి పోటీయా. అసలు అది జరిగేనా..ఇద్దరూ మంచి మిత్రులుగా ఉంటున్నారు కదా. పైగా ఒకరిని ఒకరు హత్తుకుంటూ విందులు ఆరగిస్తున్నారు కదా అని డౌట్లు రావచ్చు. రాజకీయం ఇది. అతి పెద్ద మాయాజాలం ఇది. ఎవరు ఎపుడు ఎలా ఉంటారో చెప్పలేని అద్భుతమైన గేమ్ ఇది. అందువల్ల కేసీయార్ జగన్ ఈ ఇద్దరూ ప్రత్యర్ధులు కారు, కాలేరని ఎవరూ అనుకోవడానికి వీలు లేదు. అయితే అది ఇపుడే అంత అర్జంట్ గా పోటీ పడేంతవరకూ సీన్ వచ్చిందా అన్నదే చర్చ.


జగన్ ముఖ్యమంత్రిగా నాలుగు నెలల పసి బాలుడు, కేసీయార్ కి పాలనానుభవం చాలా ఎక్కువ ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్రంలో కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్ గా కూడా ఉన్నారు. ఇక రెండు పర్యాయాలు  ముఖ్యమంత్రిగా ఆరేళ్ళ పాటు కొనసాగుతున్నారు. అందువల్ల కేసీయార్ ఏ విధంగా చూసినా జగన్ కంటే అనుభవశాలిగా చెప్పాలి.


మరి అటువంటి కేసీయార్ ఇపుడు ఒక సమస్య విషయంలో గట్టి పట్టుదల మీద ఉన్నారు. అదే తెలంగాణా ఆర్టీసీ సమస్య. అక్కడ ఉద్యోగులు తమను ప్రభుత్వంలో విలీనం చేయమని అంటున్నారు. దానికి ప్రాతిపదిక ఏపీలో జగన్ తీసుకున్న  నిర్ణయం. ఏపీలో ఆర్టీసీ సిబ్బందిని జగన్ సర్కార్ జీతగాళ్ళను చేశారు. మరి తెలంగాణాలో అదే డిమాండ్ పెడితే కేసీయార్ చించి అవతల పారేశారు.


తనకు అన్నీ తెలుసునని ఆర్టీసిని ఏం చేయాలో అన్నీ చేసినా మళ్ళీ అనవసర డిమాండ్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తెలివితక్కువ నిర్ణయం అని కేసీయార్ భావిస్తున్నారు.  అంటే ఇక్కడ జగన్ చేసిన పని తెలివి తక్కువది అని కేసీయార్ పరోక్షంగా అంటున్నట్లే మరి. తాను తెలివైన అనుభవం కలిగిన   నాయకుడిని, ప్రభుత్వ అధినేతను కాబట్టి ఆర్టీసీని తగిన విధంగా దారికి తెస్తానని అంటున్నారు.


మరి ఈ విషయంలో కేసీయార్ గట్టిగానే మాట్లాడుతున్నారు.  ఆర్టీసీలోని యాభై వేల మంది ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని కూడా చెప్పారు. కొత్త ఆర్టీసీని జనానికి చూపిస్తామని కూడా చెబుతున్నారు. మరో వైపు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకమై కేసీయార్ మీద పోరాటానికి రెడీ అయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని అంటున్నారు.


రాజకీయ గండర గండడు కేసీయార్ ఓడిపోతారా. ఆర్టీసీ యూనియన్లు  గెలుస్తాయా అన్నది ఒక పాయింట్ అయితే జగన్ తీసుకున్న విలీనం నిర్ణయం తప్పా రైటా అన్నది కూడా ఈ పోరాటం ద్వారా తేలనుందని అంటున్నారు. కేసీయార్ ఆర్టీసీని విలీనం చేయకుండానే కార్మికులను దారికి తెచ్చి సమ్మెని విరమింపచేస్తే జగన్ నిర్ణయం వీగిపోయినట్లేనంటున్నారు. లేక కేసీయార్ సైతం విలీనానికి ఓకే అంటే జగన్ ముందు తెలంగాణా పెద్దాయన అనుభవం మొత్తం ఓడిపోయినట్లేనని కూడా వాదన ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: