దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ మూడ్ అంతా మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా వైపే ఉంది. దేశంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌ర్వాత ఎక్కువ ఎంపీలు (48) ఉన్న మ‌హారాష్ట్ర‌లో అధికారం కోసం బీజేపీ - శివ‌సేన కూట‌మితో పాటు కాంగ్రెస్ - ఎన్సీపీ కూట‌మి హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. ఇక రెండు కూట‌ముల విష‌యానికి వ‌స్తే గ‌తంలో ఈ నాలుగు పార్టీలో వేర్వేరుగా పోటీ చేసి చేతులు కాల్చుకున్నాయి. అయితే ఆ ఎన్నిక‌లకు ముందు బీజేపీ - శివ‌సేన మ‌ధ్య సీట్ల లెక్క తేల‌క‌పోవ‌డంతో ఎవరికి వారే ఒంట‌రిగా పోటీ చేశారు.


ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి 120 సీట్లు రావ‌డంతో అది పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. చివ‌ర‌కు శివ‌సేన మ‌ద్ద‌తుతో బీజేపీ అక్కడ సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఆ త‌ర్వాత జ‌రిగిన గ్రేట‌ర్ ముంబై ఎన్నిక‌ల్లో సైతం రెండు పార్టీలు వేర్వేరుగానే పోటీ చేశాయి. ఆ ఎన్నిక‌ల్లో  బీజేపీకి ఎక్కువ సీట్లు వ‌చ్చినా చివ‌ర‌కు ఆ పార్టీ శివ‌సేన‌కే స‌పోర్ట్ చేసి ముంబై మేయ‌ర్ పీఠం వ‌దులుకుంది. ఇక ఇప్పుడు ఈ రెండు పార్టీలు జ‌ట్టుక‌ట్ట‌డం... అటు కాంగ్రెస్‌, ఎన్సీపీ కూడా చేతులు క‌ల‌ప‌డంతో వార్ వ‌న్‌సైడ్‌గా అయితే ఉండ‌దు.


ఇక బీజేపీ కూట‌మి ప్ల‌స్‌ల విష‌యానికి వ‌స్తే ముఖ్యమంత్రి షడ్నవిస్ ను మార్చకపోవడం, అవినీతి రహిత పాలన, దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోన్న మోడీ ప్ర‌భావం.... హిందువులు ఎక్కువుగా ఉన్న జ‌మ్మూలో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు.. త్రిఫుల్ త‌లాక్ ర‌ద్దు లాంటి అంశాలు ఆ కూట‌మికి చాలా ప్ల‌స్ కానున్నాయి. ఇటీవల కాలంలో దాదాపు 30 మంది తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఈ రెండు పార్టీల్లో చేరారు. ఇక బీజేపీతో ఎప్పుడూ కీచులాట‌తోనే ఉంటోన్న శివ‌సేన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోడీ హ‌వా చూశాక ఇప్పుడు కాస్త వెన‌క్కు త‌గ్గింది. శివ‌సేన ఎంత మేక‌పోతే గాంబీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా మోడీ హవాలో బీజేపీ తమను చిన్న చూపు చూస్తుందన్న అనుమానం, ఆవేదన శివసేన లో లేకపోలేదు.


ఇక కాంగ్రెస్‌, ఎన్సీపీ కూట‌మి క‌ష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. మ‌రాఠా దిగ్గ‌జం శ‌ర‌ద్‌ప‌వార్ వృద్ధాప్యంలో ఉన్నారు. ఈడీ ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయడంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పీసీసీ చీఫ్ అశోక్ చవాన్ ఇప్పుడిప్పుడే శక్తిని కూడదీసుకుంటున్నారు. 1999 నుంచి 2014 వరకు మూడుసార్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఈ ఎన్నికలపై పెద్దగా ఆశలు లేవు. చివ‌ర‌కు ఈ కూట‌మి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త మీద‌, ఆ కూట‌మిలో లుక‌లుక‌లు, క‌రువు, వ్యవ‌సాయం సంక్షోభం, నిరుద్యోగం మీదే ఆశ‌లు పెట్టుకుంది. ఈ కూట‌మి ఎన్ని ఆశ‌లు పెట్టుకున్నా అధికారం మాత్రం క‌ల‌లాంటిదే.


మరింత సమాచారం తెలుసుకోండి: