మనసే మనిషిని నిర్దేశిస్తుంది. ఆలోచనలు, ఆచరణ, ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. మనసు అనేది కన్పించకపోయినా దాని మూల కేంద్రం మెదడే. అదే లేకుంటే మనిషి బతుకు గల్లంతౌతుంది. సమాజంలో, వ్యక్తిగతంగా కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ, లక్ష్యాలను చేరి, ఆనందంగా జీవించేందుకు మానసిక ఆరోగ్యం తృప్తిగా ఉండేలా చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే ఆ ప్రభావం ఆ వ్యక్తికే పరిమితం కాదు. అది సమాజంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.దానివల్ల మనిషి, మనిషిలా జీవించకుండా రాక్షసపు ఆలోచనలతో దుష్టుడుగా మారి. సమాజానికే చీడపురుగులా తయారవుతాడు. అలాంటివారు విచక్షణను కోల్పోయి మంచిచెడుకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తాడు. ఇలాంటి వ్యక్తే సామ్యూల్‌ లిటల్‌..


ఇతనికి ఇప్పుడు 79 ఏళ్లు. తీవ్రంగా కనిపించే అయన ముఖంలో అప్పుడప్పుడు మాత్రమే నవ్వు ఛాయలు కనిపిస్తాయి. ఆయన గడిపిన శృంగార జీవితాన్ని గుర్తు చేసినప్పుడు మాత్రమే ఆ ఛాయల్ని చూడవచ్చు. ఒకప్పుడు ఆయన బాక్సర్‌. అందుకు తగినట్లుగానే ఆయనది దృఢమైన కాయం. ఆయన ఒక్క చేతితో గుద్దాడంటే చాలు, ఆ క్షణంలో అవతలి వారి ప్రాణం పోవాల్సిందే. అలాగే ఆయన 93 మందిని హత్య చేశాడు. వారంతా ఆడవాళ్లే. వారిలో ఎక్కువ మంది వ్యభిచారిణులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారే, వారిలో కొంత మంది జీవితంలో  బాగా దెబ్బతిన్న వాళ్లు కూడా ఉన్నారు. వారందరితో శృంగార జీవితం గడిపన తర్వాతే సామ్యూల్‌ వారిని హత్య చేసేవాడు. ఇల్లు, వాకిలి కూడా లేకుండా చిల్లర దొంగతనాలు చేసే ఆయన తనతో గడిపే ఆడవారి మీదనే ఆధారపడి బతికే వాడట.


ఆయన ఎక్కువగా హత్యలు చేసిందీ అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్, మియామీలలో. దక్షిణ కరోలినా, ఓహాయో, టెక్సాస్‌ సహా 19 రాష్ట్రాలకు ఆయన హత్యలు విస్తరించాయి. ఇప్పుడు అమెరికా చరిత్రలోనే ఎక్కువ మందిని చంపిన సీరియల్‌ కిల్లర్‌గా అక్కడి పోలీసులు ఆయన్ని గుర్తిస్తున్నారు. ఇంతవరకు ఈ కిరాతక రికార్డు లారీ డ్రైవర్‌ గేరి రిడ్జ్‌వే పేరిట ఉండింది. ‘గ్రీన్‌ రివర్‌ కిల్లర్‌’గా పేరు పొందిన అతను 1980 నుంచి 1990 దశకంలో 49 హత్యలు చేశాడు. ఆ తర్వాత మరో 20 హత్యలు చేసినట్లు తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును కిరాతక కిల్లర్‌ సామ్యూల్‌ లిటిల్‌ అధిగమించాడు. ఇప్పుడు సామ్యూల్‌ లిటిల్‌ కూడా తాను చేసిన 93 మంది మహిళల హత్యల్లో 50 హత్యలను ఒప్పుకున్నాడు. పైగా వారందరి బొమ్మలను గీసి చూపించాడు.


దాంతో ఇప్పటి వరకు అంతుచిక్కని మహిళల హత్యలు,  అదశ్య సంఘటనల చిక్కు ముడులు విడి పోతున్నాయి. ఇంకో 43 హత్య కేసులను ఆయన అంగీకరించాల్సి ఉంది. వారి పేర్లు లేదా కనీసం వారి ముఖాలు కూడా ఆయనకు గుర్తు లేకపోవడమే నేరం అంగీకరించక పోవడానికి కారణం. ఇక సామ్యూల్‌ లిటిల్‌ మాట్లాడుతూ తనను ‘సెక్స్‌ ప్రిడేటర్‌’ అని అనవసరంగా ముద్ర వేస్తున్నారని, తాను హంతకుడిని మాత్రమేనని ఆయన చెప్పాడు..ఇకపోతే తాను ఇంతవరకు ఏ అమ్మాయిని రేప్‌ చేయలేదని, ఇష్ట పూర్వకంగానే అమ్మాయిలు తనతో గడిపారని సామ్యూల్‌ వివరించాడు. ఇప్పుడు ఎప్‌బీఐ అధికారులు సామ్యూల్‌ను ఇంటరాగేట్‌ చేస్తున్నారు. ఈ కేసులో దోషిగా తేలితే ఏ శిక్ష విధిస్తారోనని అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: