అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర దేవాదాయ   ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదన్నారు. ఎన్నికల ప్రచారంలో అర్చకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అర్చక సమాఖ్య నాయకులు కోరిన సంగతి తెలిసిందే. సీఎం జగన్  ఆదేశాలతో బుధవారం సచివాలయంలో అర్చకులతో మంత్రి వెల్లంపల్లి సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ పద్మ, తిరుపతి  జేఈఓ  బసంత్ కుమార్, ఎమ్మెల్యే విష్ణులు పాల్గొన్న  భేటీకి అర్చక సమాఖ్య బ్రాహ్మణ సమైక్య నాయకులతో పాటు పురోహితులు 13 జిల్లాల నుంచి  బ్రాహ్మణ సంఘాల నాయకులు హాజరయ్యారు.



జీవో నెంబర్ 76 ను అమలు చేయాలంటూ  అర్చక సంఘాలు మంత్రిని కోరారు. ధార్మిక పరిషత్ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అర్చక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి సబ్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. దేవాలయ భూములు,  ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం  కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా అర్చకత్వం నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. దీని కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు తీరును పరిశీలిస్తామన్నారు. కనీస ఆదాయం లేని దేవాలయాలలోని అర్చకులకు గౌరవ వేతనం  5 నుంచి 10 వేలకు పెంచడానికి చర్యలు చేపడతామన్నారు. అదే విధంగా రూ.10000 ఉన్న భృతిని రూ.16500 లకు పెంచనున్నామని చెప్పారు. ప్రస్తుతం 1600 దేవాలయాల్లో దూపదీప నైవేద్య పథకం అమలవుతోందన్నారు.



ఈ పధకాన్ని రాష్ట్రంలోని  3,600 దేవాలయాలకు వర్తించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. డి డి ఎస్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని 10 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అంతే కాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద ధార్మిక పరిషత్తు, అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇదే క్రమంలో అర్చకులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా హెల్త్ కార్డులను వర్తింప చేయనున్నట్టు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. దేవాదాయ కమిషనర్ కార్యాలయం సముదాయంలో ఉన్న అర్చక సంక్షేమ భవనాన్ని విస్తరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: