స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల గురించి ఆలోచన చేస్తుందా..? స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయిలో మరింత పట్టు సాధించేందుకు అధికార పార్టీ కాలు దువ్వుతోంది. ఈ క్రమంలో సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తే గ్రామ స్థాయి రాజకీయాలపై మరింత పట్టు బిగించవచ్చనేది వైసీపీ వ్యూహం. అయితే సర్కార్ ఆలోచన ఏ విధంగా ఉంది..? స్థానిక సంస్థల ఎన్నికల గురించి జగన్ ఏమంటున్నారు.. ?


చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో 50 శాతం ఓట్లతో.. 153 స్థానాలతో వైసీపీ ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. చెప్పిన విధంగా.. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం కూడా దూకుడుగానే వెళ్తోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయిలో మరింత పట్టు బిగించవచ్చనేది వైసీపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సర్కార్ తన కసరత్తును ముమ్మరం చేస్తోంది. డిసెంబర్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే సమయంలో సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తే గ్రామ స్థాయిల రాజకీయాలపై మరింత పట్టు సాధించే అవకాశం కలుగుతుందనేది అధికార పార్టీలోని మెజార్టీ పెద్దల భావన. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంతోపాటు.. ఊపులో ఊపు సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తే మొత్తంగా పట్టు సంపాదించవచ్చనేది సదరు పెద్దల వ్యూహం.


అయితే సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన వేరే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఇటీవల సహకార శాఖకు సంబంధించి జరిగిన సమీక్షలో ఈ తరహా సంకేతాలను ఇచ్చారట సీఎం జగన్. గత ఐదేళ్ల కాలంలో సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో నాటి చంద్రబాబు సర్కార్ భ్రష్టు పట్టించేసిందనేది సీఎం జగన్ భావన. అందులో భాగంగా సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందిగా ఆ సమీక్ష సమావేశంలో ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారట. అవసరమైతే.. దీని కోసం ప్రత్యేకంగా ఐఐఎంలను రిక్రూట్ చేసుకోవాలని జగన్ సూచించినట్టు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో జిల్లా సహకార బ్యాంకులు రైతులకు.. వివిధ సొసైటీలకు రుణాలు జారీ చేయడం ఆనవాయితీ. అయితే వీటిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. ముందుగా ఈ అవకతవకలకు అడ్డుకట్ట వేయడం కాకుండా.. రైతుకు అవసరమైన మేరకు రుణాలు అందాలంటే సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇదేదో హడావుడిగా కాకుండా.. కొంచెం ఆలస్యమైనా పక్కా ప్రణాళికతో.. సహకార రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


ఈ క్రమంలో అదే సమీక్షలో పాల్గొన్న అధికారులు.. సహకార ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. భ్రష్టు పట్టిన సహకార సంస్ధను ప్రక్షాళన చేయాలని తాను ఓ పక్క స్పష్టంగా చెబుతుంటే..  ఎన్నికలను ఏ విధంగా నిర్వహిస్తారని జగన్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు సహకార వ్యవస్థలో రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువగా ఉండబట్టే.. సహకార వ్యవస్థ ఈ విధంగా తయారైందని.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. సహకార సంఘాలను చేజిక్కించుకునేది తమ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ.. వారు కూడా రాజకీయ నేతలే కదా అంటూ ఆసక్తికర కామెంట్ చేశారట జగన్. రాజకీయ ప్రమేయం లేని సహకార వ్యవస్థను రూపొందించాక.. ఆ తర్వాత సహకార సంఘాల ఎన్నికలకు వెళ్దామని సీఎం జగన్ ఖరాఖండీగా స్పష్టంగా చెప్పేసినట్టు తెలిసింది. దీంతో సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేననే విషయం అర్థమవుతోంది. ఈ క్రమంలో సహకార సంఘాల ఎన్నికలు జరగాలంటే కనీసం ఆరేడు నెలల సమయం పట్టే సూచనలు స్పష్టంగా కన్పిస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: