అర్చకుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన అర్చక సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అర్చకులకు సంబంధించిన అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అర్చక సంఘాలతో చర్చించిన అంశాలను సమావేశం అనంతరం మీడియాకు వివరించారు.

 

 

 

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే అర్చకుల జీతాలను 25శాతం పెంచుతామని చెప్పారు. వంశపారంపర్య అర్చకత్వంపై త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్చకుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అర్చకుల బాగు కోసం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అర్చకులకు హెల్త్ కార్డులు, జీవో 76 అమలుపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు  ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు 13 జిల్లాల అర్చక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

 

 

అర్చకుల అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో కొన్ని ప్రణాళికలు రూపొందించారు. సీఎం అయ్యాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల సమస్యలు గతం నుంచీ ఉన్నవే. అయితే వారి ప్రతిపాదనల మేరకు వారి సమస్యలు పరిష్కారం కాలేదని అర్చకులే పలుమార్లు చర్చించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తామని అర్చక సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో ఏళ్లుగా వారి సమస్యలకు ఓ పరిష్కారం లభించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: