ఆంధ్ర‌ప్ర‌దేశ్ రవాణాశాఖ ప్రైవేటు ట్రావెల్స్‌పై ఉక్కుపాదం మోపింది. దసరా పండుగ సందర్భంగా ప్రవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుండి అధిక టిక్కెట్ ధరలు వసూలు చేస్తున్న నేప‌థ్యంలో ప్రత్యేక బృందాలలతో కృష్ణా జిల్లా రవాణాశాఖ తనిఖీలు చేపట్టింది. అధిక ధ‌రలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ఒక్క మంగ‌ళ‌వారం నాడే 42 కేసులు నమోదు అయ్యాయి. గరికపాడు చెక్ పోస్టు, పొట్టిపాడు టోల్ ప్లాజా, కీసర టోల్ ప్లాజాలవద్ద జరిపిన ప్రత్యేక తనిఖీలలో గత 5 రోజులలో  295 కేసులు నమోదు అయ్యాయి. 6 బస్సులు సీజ్ కూడా చేశారు.


అధిక ధరలు వసూలు చేసిన ఒక్కొక బస్సుకు ర‌వాణ‌శాఖ అధికారులు 25 వేల రూపాయల జరిమానా విధించారు. మూడు రోజులలోపు అపరాధ రుసుము 25వేల రూపాయలు చెల్లించకపోతే బస్సులు సీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రయాణికుల నుండి అధిక ధరలు వసులుచేస్తే సహించేదే లేదని స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక బృందాలతో దీపావళి పండుగ వరకు తనిఖీలు కొనసాగిస్తున్నామ‌ని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు సంబందించిన రికార్డులను రవాణాశాఖ ఆన్లైన్ వెబ్‌సైట్ లలో ప్రయాణికులు చూసుకోవచ్చున‌ని తెలిపారు. బస్సుకు టాక్స్ కట్టకపోయిన, ఫిట్ నెస్ ,పర్మిట్ లేకపోయినా బస్సులను ఎక్క‌వ‌ద్ద‌ని కోరింది. 


ఇదిలాఉండ‌గా, తెలంగాణ ర‌వాణశాఖ సైతం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని, ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని, టికెట్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరుగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్‌, డివిజనల్‌ మేనేజర్లు, ఆర్టీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడారు. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు తింపుతున్నామన్నారు. అయితే కొన్నిచోట్ల టికెట్‌ రేట్‌ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బస్సులు ఆయా రూట్లలో ఉంటే ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా నియమిస్తున్నట్లు  చెప్పారు. బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్‌ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్‌ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: