ఈవారంలోనే చెన్నైకి చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ రానున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న మ‌న‌దేశంలో అడుగుపెట్ట‌డానికి ముందే...ఊహించ‌ని ట్విస్టుల‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత పాక్‌, భార‌త్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే అవ‌స‌ర‌మైన మేర‌కు పాక్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్లు తాజాగా జిన్‌పింగ్ తెలిపారు. క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు చైనా అధ్య‌క్షుడు  తెలిపారు. ఆ దేశానికి చెందిన జినావు ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. బీజింగ్‌లో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ను క‌లిసిన త‌ర్వాత జీ జిన్‌పింగ్ క‌శ్మీర్‌పై త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ఇరు దేశాలు శాంతియుతంగానే ప‌రిష్క‌రించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 


కాగా, భారత్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 11-12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ తమిళనాడులోని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు చెన్నై సమీపంలోని కాంచీపురం జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భేటీ జరిగే వేదికతో పాటు ఆ ప్రాంతమంతా కొత్త హంగులతో కళకళలాడుతోంది. ప్రత్యేక సమావేశాలు జరగనున్న ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం ఉన్నతాధికారులు ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది రెండు రోజుల చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించారు. ప్రపంచ చరిత్రాత్మక వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా యునెస్కో గుర్తింపు పొందిన మహాబలిపురాన్ని చివరికి ఖరారు చేశారు.


ఇదిలాఉండ‌గా, చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ చెన్నై రానున్న నేప‌థ్యంలో వెల్క‌మ్ బ్యాన‌ర్లు పెట్టుకునేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి మ‌ద్రాసు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. చెన్నై నుంచి 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌హాబ‌లిపురం వ‌ర‌కు స్వాగ‌త తోర‌ణాల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావించింది. దీని కోసం కోర్టు అనుమ‌తి కోరింది. జ‌స్టిస్ స‌త్య‌నారాయ‌ణ‌న్‌, జ‌స్టిస్ శేష‌సాయిలతో కూడిన బెంచ్ ప్ర‌భుత్వానికి అనుమ‌తిస్తూ తీర్పునిచ్చింది. ఫ్లెక్సీ బ్యాన‌ర్లు పెట్టేందుకు కేవ‌లం రాజ‌కీయ పార్టీల‌కు మాత్రమే అనుమ‌తి లేద‌ని బెంచ్ తెలిపింది. ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా బ్యాన‌ర్లును ఫిక్స్ చేయాల‌ని కోర్టు చెప్పింది. రాజ‌కీయ పార్టీలు మాత్రం ఎటువంటి బ్యాన‌ర్లును ఏర్పాటు చేయ‌రాదు. గ‌త నెల‌లో చెన్నైలో ఓ అమ్మాయి బ్యాన‌ర్ మీద ప‌డ‌డం వ‌ల్ల చ‌నిపోయింది. స్కూటీపై వెళ్తున్న ఆ అమ్మాయిపై బ్యాన‌ర్ ప‌డ‌డంతో.. ఆమె లారీని ఢీకొట్టింది. దీంతో ఆ యువ‌తి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత త‌మిళ‌నాడులో బ్యాన‌ర్ల‌ను నిషేధించాల‌న్న డిమాండ్ పెరిగింది. దీంతో, మోదీ, జిన్‌పింగ్ రాక సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్క‌మ్ బ్యాన‌ర్ల కోసం అనుమ‌తి తీసుకోవాల్సి వ‌చ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: