ఆర్టీసీ సమ్మె రూపం లో అధికార పార్టీ కొత్త ముప్పు వచ్చి పడింది . అసెంబ్లీ ఎన్నికల్లో జత కట్టిన కాంగ్రెస్ ను కాదని , తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ తో జట్టు కట్టిన సిపిఐ ప్రస్తుతం తమ నిర్ణయాన్ని పున సమీక్షించుకోనున్నట్లు ప్రకటించింది . హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టి -జాక్ చైర్మన్ కోదండ రామ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆరెస్ కు మద్దతునివ్వాలని సిపిఐ నిర్ణయించిన విషయం తెల్సిందే .


 గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  మిగిలిన రాజకీయ పక్షాలతో జట్టు కట్టిన   సిపిఐ,  అధికార టీఆరెస్ కు వ్యతిరేకంగా పోటీ చేసింది . అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మాత్రం పాత మిత్రుడైన కాంగ్రెస్ ను కాదనుకుని , అధికార పార్టీ తో జట్టు కట్టాలని నిర్ణయించుకుంది . ఈ నెల ఐదవ తేదీ అర్ధ రాత్రి నుంచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ , ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెల్సిందే . ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం , దాదాపు 48  వేల మందికి పైగా కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది .


 ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి . కార్మిక పక్షపాతిగా చెప్పుకునే సిపిఐ కూడా అందుకు మినహాయింపేమీ కాకపోవడంతో , హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ కి మద్దతునిచ్చే అంశం పై పునరాలోచన చేస్తామని ప్రకటించింది .


మరింత సమాచారం తెలుసుకోండి: