ఆర్టీసీ సమ్మె సమయంలో ఇప్పటికే అనేక రకాల పాసులు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. సమ్మె కారణంగా వారు ముందే డబ్బు చెల్లింపు పాసులు తీసుకున్నా మళ్లీ డబ్బు పెట్టి ప్రయాణించాల్సి వస్తోంది. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది లేదంటున్నారు రవాణా శాఖ మంత్రి పున్వాడ అజయ్. ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో... షెడ్యూల్‌ ప్రకారం బస్సులను నడుపుతామన్నారాయన.


ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్‌ షెడ్యూల్‌ ఉండేదో అదే షెడ్యూల్‌ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామన్నారు. ఇక ఆర్టీసీ బస్సులన్నింటా బస్‌పాస్‌లను యదా విధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామన్నారు.


విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్‌పాసులన్నీ అనుమతించాలని, బస్‌పాస్‌లు అనుమతించడం లేదనే ఫిర్యాదు రావద్దని మంత్రి పువ్వాడ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ దిశా నిర్ధేశంతో ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజా రవాణా స్థితిగతులన్ని పరిశీలిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమ్మె కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రవాణా సదుపాయాలు కల్పించామన్నారు.


బుధవారం ఆర్టీసీ బస్సులు 3116, ఆర్టీసీ అద్దె బస్సులు 1933తో పాటు ప్రైవేట్‌ వాహనాలు తిరిగాయన్నారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టీ మరిన్ని వాహనాలను తిప్పుతామన్నారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి పువ్వాడ వివరించారు.


నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక సర్వీసుల సేవలన్నీ వినియోగించుకుంటున్నట్లు మంత్రి అజయ్‌ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: