ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహిళలకు ఈ ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్ ఉండాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 
 
ఇప్పటివరకు రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం ఏజెన్సీలు చేపడుతున్నాయి. రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సకాలంలో జీతాలు రాకపోవటం, జీతాలు వచ్చినా పూర్తి స్థాయిలో లభించకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీలు వారికి ఇష్టం వచ్చిన రీతిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నాయి. ఏజెన్సీల ద్వారా జరిగే నియామకాల్లో అందరికీ అవకాశం లభించటం లేదు. 
 
2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు కోసం ప్రస్తుతం కార్పొరేషన్ ఏర్పాటు అవుతోంది. ఈ కార్పొరేషన్ సాధారణ పరిపాలనాశాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. జిల్లాల స్థాయిలో ఈ కార్పొరేషన్ కు విభాగాలు ఉంటాయి. జిల్లా ఇన్ చార్జ్ మంత్రులు జిల్లా విభాగాలకు నేతృత్వం వహిస్తారు. 
 
ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసి ఆ వెబ్ పోర్టల్ ద్వారా నియామకాలు చేపడుతుంది. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ కు సీఎం ఆమోదం తెలపనున్నారు. ఈ కార్పొరేషన్ డిసెంబర్ 1వ తేదీ నుండి పని చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు, మహిళలకు ఈ ఉద్యోగాలలో సముచిత ప్రాధాన్యం దక్కుతుంది. ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న వారికి ఒకే పనికి ఒకే రకమైన వేతనం లభిస్తుంది. ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఆన్ లైన్ ద్వారా చెల్లిస్తుంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: