’ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏల మధ్య పంచాయితీలు చేస్తున్నారు’...ఇది తాజాగా జగన్ పై చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణ. జగన్ పై చంద్రబాబులో ఏ స్ధాయిలో అక్కసు పేరుకుపోయిందో చెప్పటానికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే.  ఎంఎల్ఏల మధ్య జగన్ పంచాయితీలు చేస్తే చంద్రబాబుకు ఎందుకంత నొప్పి ? సిఎం కాకుముందు జగన్ వైసిపి అధ్యక్షుడన్న విషయం అందరకీ తెలిసిందే.

 

పార్టీ అధ్యక్షుడు, సిఎంగా ఉన్న వ్యక్తులు రెండు పాత్రలను పోషించాలన్న విషయం చంద్రబాబుకు తెలీదా ? తాను సిఎంగా ఉన్నపుడు చేసిందేమిటి ? మంత్రులు, ఎంఎల్ఏల మధ్య ఎన్నిసార్లు పంచాయితీలు చేయలేదు ? కడప జిల్లాలో ఆది నారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డి, విశాఖపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు-గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు అచ్చెన్నాయుడు-కింజరాపు రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళ మధ్య పంచాయితీలు చేసిన విషయం మరచిపోయారేమో .

 

తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అనే పద్దతిలో ఉంటాయి చంద్రబాబు చేసే పనులు,  చెప్పే నీతులు. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ చాలా నయమనే చెప్పాలి. నెల్లూరు జిల్లాలోని ఇద్దరు ఎంఎల్ఏల మధ్య వివాదం మొదలైతే దాన్ని పార్టీ సీనియర్ నేతలకు అప్పగించి పంచాయితీ చేయించారు. గతంలో చింతమనేని ప్రభాకర్ అప్పటి ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన ఘటనలో స్వయంగా తానే  పంచాయితి చేసిన విషయాన్ని చంద్రబాబు  మరచిపోయినట్లున్నారు.

 

చింతమనేని, వనజాక్షి వివిదాంలో తన ఎంఎల్ఏదే తప్పని తెలిసినా తప్పంతా వనజాక్షిదే అంటూ తేల్చి చెప్పిన ఘనుడు చంద్రబాబు. అలాగే రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యంపై బోండా ఉమా మహేశ్వరరావు, కేశానేని నాని అందరిముందు ధౌర్జన్యం చేస్తే చంద్రబాబు పంచాయితీ చేయలేదా ? 

 

జిల్లాల పర్యటన పేరుతో టూర్లు వెళ్ళి మరీ మంత్రులు, ఎంఎల్ఏల మధ్య పంచాయితిలు చేసిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారేమో ? పార్టీ నేతల మధ్య వివాదాలు తలెత్తితే సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కూడా  ముఖ్యమంత్రులుగా ఉండే పార్టీ అధ్యక్షులదే అన్న కనీస ఇంగితాన్ని కూడా చంద్రబాబు వదిలేయటం విచిత్రంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: