ఓ తెలుగు సంగీత దర్శకుడు ఓ అరుదైన రికార్డు సాధించారు. అది కూడా ప్రపంచంలోనే పేరున్న గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం దక్కించుకుంటున్నారు. ఏకధాటిగా 61 గంటల పాటు సంగీతాలాపన చేసి ఈ రికార్డు సొంతం చేసుకుంటున్నారు. ఈ అరుదైన కార్యక్రమానికి లండన్ నగరం వేదికగా నిలిచింది.


వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సంగీత దర్శకుడు.. స్వరవీణాపాణిగా సుపరిచితులైన వోగేటి నాగ వెంకట రమణమూర్తి అరుదైన ఘనత సాధించారు. లండన్ వేదికగా నిర్వహించిన సంగీత విభావరిలో 'లాంగెస్ట్ మారథాన్ చర్చ్ ఆర్గాన్ ప్లేయింగ్ అనే అంశంలో 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాల పాటు సంగీత సాధన చేశారు. ఆపకుండా పాటలు ఆలపించిగిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. గతంలో నార్వేకు చెందిన నీనా ఇర్స్ లింగర్ పేరిట ఉన్న 60 గంటల ఒక నిమిషం 25 సెకన్ల రికార్డును స్వరవీణాపాణి అధిగమించి సంగీత మారథాన్లో సరికొత్త రికార్డు సృష్టించారు.


గిన్నిస్ రికార్డుల అధికారిక న్యాయ నిర్ణేత జాక్ బ్రాక్ బ్యాంక్ రికార్డు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ అపూర్వ కార్యక్రమాన్ని యునైటెడ్ కింగ్ మ్ తెలుగు అసోసియేషన్, అమెరికాకు చెందిన వెన్నం ఫౌండేషన్, ఇండియాకు చెందిన స్వర నిధి, లండన్ కు చెందిన ద భవన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 2 వరకూ సాగింది.


ఇంకా ఈ కార్యక్రమానికి ట్రిపుల్ గిన్నిస్ రికార్డు విజేత డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి,గిన్నిస్ అధికారులు జాక్, సోనియా, యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక చైర్మన్ సత్య ప్రసాద్ కిల్లీ, అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాజశేఖర్ కుర్బ, సి. అమర్నాథ్ రెడ్డి స్వరవీణాపాణిని సత్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: