మోడీ ప్రాభవం ఇంటా బయట మధ్యాహ్న మార్తాండుడిగా  వెలిగిపోతోంది. ఆయన్ని ఎదిరించి నెగ్గుకురావడం ఇప్పట్లో కష్టసాధ్యమే. అందుకే బెంగాల్ కాళిక మమతా బెనర్జీ, తెలంగాణా టైగర్ కేసీయార్ కూడా మోడీ కోసం ఢిల్లీ వెళ్ళి ఓ దండం పెట్టి వచ్చారు. కేంద్రం చేసే సాయం చేయకున్నా అపకారం మాత్రం చేయవద్దన్నట్లుగా ఈ ఇద్దరు నేతలు మోడీతో భేటీ అయ్యారని రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి.


ఇక రాజకీయంగా చూస్తే వీరికంటే జూనియర్ అయిన ఏపీ సీఎం జగన్ బాధ వేరుగా ఉంది. ఆయన పోరాడేందుకు ఎటు చూసినా అవకాశమే లేదు. విభజనతో పూర్తిగా నష్టపోయి సముద్రపు ఒడ్డున పడి ఉన్న స్టేట్ గా ఏపీ తయారైంది. తుపానులు, సునామీలు శాపంగా మారుతూంటే హైదరాబాద్ సాటి నగరం ఒక్కటి కూడా లేని నవ్యాంధ్రకు రెండవ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు.  జగన్ చూపు ఇపుడు పాలన మీదనే ఉంది. తాను ముందు ముఖ్యమంత్రిగా కుదురుకోవాలి. పాలన గాడిలో పడాలి. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలి. అందుకు అవసరమైన నిధులు కావాలి. అభివ్రుధ్ధి చేయలాంటే లక్షల కోట్లు అవసరం. అదే సంక్షేమం అయితే వేల కోట్లు చాలు. జగన్ ఆలోచన ప్రస్తుతం ఇదే.


అయితే ఈ మొత్తం కూడా ఏపీ ఖజానాలో లేదు. మోడీ సర్కార్ తో జగన్ మొదటి నుంచి సఖ్యతగానే ఉంటున్నారు. జగన్  విపక్షంలో ఉన్నపుడు కూడా ఒక్క మాట బహిరంగంగా అనలేదు, ఇపుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానిని తరచూ కలసి ఏపీ సమస్యలు విన్నవిస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి కూడా అందులో పెడుతున్నారు. విభజన హామీలు తీర్చమంటున్నారు. కానీ కేంద్రం ఉలకడంలేదు, పలకడంలేదు. నాడు చంద్రబాబు మోడీకి దాసోహం అన్నా నేడు జగన్ శరణు జొచ్చినా కూడా బీజేపీ తీరు మారడంలేదు.


ఏపీ విషయంలో వారికి ఉన్నది రాజకీయ అజెండా మాత్రమే. తమకు ఓటూ సీటూ లేని రాష్ట్రం పట్ల మమకారం ఎందుకన్న ధోరణిలో కేంద్రం ఉంది. మరిపుడు జగన్ పోరాటానికి సిధ్ధమా. ఒకవేళ ఆయన పోరాటం చేస్తే చంద్రబాబు సహకరిస్తారా. లేక బీజేపీ వైపు తిరిగి తన రాజకీయాన్ని కాపాడుకుంటారా. ఏది ఏమైనా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలిసి కూడా నోరెత్తలేని స్థితిలో తెలుగు పాలకులు ఉండడం బాధాకరమే.


మరింత సమాచారం తెలుసుకోండి: