సమ్మెపై అటు  ఆర్టీసీ కార్మికులు ఇటు ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు . పట్టు విడుపు ప్రదర్శించేందుకు అటు ప్రభుత్వం , ఇటు కార్మికులు ఎంతమాత్రం సిద్ధంగా ఉన్నట్లు కన్పించడం లేదు .   తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి  చెబుతుండగా,  విధుల నుంచి తొలగించిన కార్మికులు స్థానంలో కొత్త వారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ఈ నేపథ్యంలో హైకోర్టులో సమ్మెపై ఇరు వర్గాలు నేడు  తమ వాదనలు వినిపించాయి. ఇరు వర్గాల వాదనలు పూర్తి అయిన తరువాత హైకోర్టు ఎటువంటి తీర్పు వెలువరించనుందనేది ఆసక్తికరంగా మారింది .


 గత ఆరు రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు .  ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు  సమ్మెకు వెళ్లిన విషయం తెలిసిందే.  సమ్మెకు వెళ్లిన వారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించిన  రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా  చెప్పినట్టుగానే దాదాపు 48 వేల మంది కార్మికులు తొలగిస్తున్నట్లు ప్రకటించింది . ఒకేసారి దాదాపు 48 వేలమంది కార్మికులను  తొలగించడం చట్టవిరుద్ధమని కార్మిక సంఘాలు వాదిస్తుండగా ,  ఇదే తరహాలో గతంలో తమిళనాడు ప్రభుత్వం కూడా ఉద్యోగులను  తొలగించిన విషయాన్ని ప్రభుత్వ  వర్గాలు గుర్తుచేస్తున్నాయి. తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించగా, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఉద్యోగులకు ఊరట కల్పించింది .


 అయితే … అదే సమయం లో ప్రభుత్వానికి ఉద్యోగులు క్షమాపణలు చెప్పాలంటూ సూచించింది . ఎస్మా చట్టం కింద అవసరమైతే ఉద్యోగులను తొలగించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ , న్యాయస్థానాల్లో ఆ కేసులు నిలబడిన దాఖలాలు మాత్రం లేవు .


మరింత సమాచారం తెలుసుకోండి: