ఆర్టీసీ కార్మికుల సమ్మెలో రోజురోజుకు కొత్త కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో పూర్తి స్థాయిలో బస్సులు కదలట్లేదు. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికుల మధ్య పోరు ఏ మాత్రం తగ్గటం లేదు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీయార్ ఎస్మా చట్టం ప్రయోగించి 48 వేల మంది కార్మికులను తొలగించామని ప్రకటన చేసినప్పటికీ కార్మికులు ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్రంలోని జర్నలిస్టు సంఘాలు, మహిళా సంఘాలు, దళిత, యువజన, విద్యార్థి, కార్మిక, కర్షక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సంఘాల నేతల నుండి కేసీయార్ కు ఆర్టీసీ కార్మికులను తొలగించే హక్కు ఎక్కడిదనే ప్రశ్న వినిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు ఒంటరి అని అనుకోవద్దని తామంతా ఆర్టీసీ కార్మికుల వెంటే ఉన్నామని సమ్మెలో పాల్గొన్న సంఘాల నేతలు ప్రకటన చేశారు. జనంలోకి టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రావాలని రాకపోతే ఎలా రప్పించాలో తెలుసని సంఘాల నేతలు అన్నారు. 
 
జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదని ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్య సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రకటన చేశారు. ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆగ్రహం కలిగిస్తున్నాయని, సర్కారు తీరును తప్పుబడుతున్నామని అశ్వత్థామ రెడ్డి అన్నారు. సంఘాల నేతలు కేసీయార్ ఒక వైపు తెలంగాణ సమాజం మరోవైపు నినాదంతో సిధ్ధంగా ఉన్నట్లు చెప్పారు. 
 
ప్రభుత్వ శాఖలు, ప్రజలు ఈ పోరాటానికి కలిసిరావాలని అన్నారు. ఆర్టీసీ జేఏసీ 19వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని చెబుతోంది. జేఏసీ నేతలు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను కేసీయార్ వ్యాఖ్యలతో సహా పూర్తి వివరాలతో కలుస్తామని ప్రకటన చేశారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు ఈ పోరాటం ఆర్టీసీ కార్మికుల పోరాటం మాత్రమే కాదని తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటమని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: