కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  నరేంద్ర మోదీ సర్కార్‌ దీపావళి కానుకగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 49.93 లక్షల మంది ఉద్యోగులకు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు శుభవార్త చెప్పింది.. ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), పింఛనుదార్లకు కరువు ఉపశమనాన్ని(డీఆర్‌) పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ప్రకాష్‌ జవదేకర్‌ బుధవారం  మీడియాకు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించే  డీఏ, డీఆర్‌ 12 శాతంనుంచి 17శాతానికి పెరిగింది. తాజా పెంపుతో  కేంద్ర ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయల భారం పడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు.


పెంచిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నారు. దీనివల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుందని వెల్లడించారు.  అంతే కాదు ఆశా వర్కర్లకు  కేంద్రం అందించే భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు కేంద్రమంత్రి  ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు  వెయ్యిరూపాయిలుగా ఉన్న ఈ రెమ్యూనరేషన్‌  ప్రస్తుతం​ రూ. 2 వేలకు చేరింది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఒకేసారి 5 శాతం పెంచడం ఇదే మొదటిసారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.ఇకపోతే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి జమ్మూ కశ్మీర్‌లో స్థిరపడిన నిర్వాసిత కుటుంబాలకు ఇస్తున్న రూ.5.5 లక్షల పునరావాస ప్యాకేజీని ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన 5,300 నిర్వాసిత కుటుంబాలకూ అందించాలని నిర్ణయించారు.


1947లో,  31,619 కుటుంబాలు పీవోకే నుంచి జమ్మూకశ్మీర్‌లోకి వలసవచ్చాయి. ఈ కుటుంబాలకు రూ.5.5 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీని 2016లో,  26,319 కుటుంబాలకు అందించింది. ఇంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం-కిసాన్‌) పథకం కింద రైతులు రూ.6,000 లబ్ధి పొందడానికి ఆధార్‌ సీడింగ్‌ చేయించుకునేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం నవంబరు 30 వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14 కోట్ల మంది రైతులకు మొత్తం రూ.87,000 కోట్లు అందివ్వనున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: