జగన్మోహన్ రెడ్డి ఇమేజి పెంచేందుకు మరో పథకం రెడీ అయ్యింది. వైఎస్సార్ కంటివెలుగు పథకం ఈరోజు అనంతపురంలో లాంఛనంగా ప్రారంభమవుతోంది. 6 దశల్లో అమలయ్యే ఈ పథకాన్ని జగన్ ఈరోజు అనంతపురంలో ప్రారంభించబోతున్నారు. మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకంలో ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు.

 

రాష్ట్రంలోని అన్నీ స్కూళ్ళు అంటే ప్రైవేటు, ప్రభుత్వం అని తేడా లేకుండా ప్రతీ స్కూలుకు వైద్య సిబ్బంది  వెళ్ళి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి కంటి అద్దాలను అందిస్తారు లేకపోతే శస్త్రచికిత్సలకు సిఫారసు చేస్తారు.  ఇదే క్రమంలో తరువాత దశల్లో పేదలందరికీ కూడా కంటి పరీక్షలను నిర్వహించాలని, కళ్ళద్దాలు అందించాలన్నది జగన్ ఉద్దేశ్యం.

 

ఇక  శస్త్రచికిత్సలు అవసరమైన వాళ్ళకు కూడా అవసరమైన ఆపరేషన్లను కూడా ఉచితంగా చేయించే ఆలోచన జగన్ కు ఉంది. అయితే ఉచిత ఆపరేషన్లంటే మామూలు విషయం కాదు. అందుకనే ఇపుడు బహిరంగంగా ప్రకటించకపోయినా స్వచ్చంధ సంస్ధలతో అవగాహన కుదుర్చుకున్న తర్వాత ఉచిత ఆపరషన్లకు శ్రీకారం చుట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

వైఎస్సార్ కంటివెలుగు పథకం గనుక  సక్రమంగా అమలైతే జగన్ ఇమేజి అమాంతం పెరిగిపోవటం ఖాయమనటంలో సందేహం లేదు. తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు ముందు  ప్రవేశపెట్టిన ఇదే పథకం వల్ల కెసియార్ ఇమేజి పెరిగి మంచి పేరొచ్చింది. అప్పుడంటే సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టారు కాబట్టి పథకం అమలును కెసియార్ ప్రతిష్టగా తీసుకున్నారు కాబట్టి సక్సెస్ అయ్యింది.

 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేస్తున్న విధానం, మరికొన్ని పథకాల అమలుకు టైం టేబుల్ ప్రకటించటంతో జనాల్లో మంచి పేరొచ్చింది.  అదే సమయంలో ఇసుక సరఫరా లాంటి వాటితో కాస్త బ్యాడ్ నేమ్ వచ్చింది కూడా వాస్తవమే. ఇపుడు తాజాగా పేదలకు వరంలాంటి వైఎస్సార్ కంటి వెలుగు సంక్షేమ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇది గనుక సక్రమంగా అమలైతే జగన్ ఇమేజి ఒక్కసారిగా పెరిగిపోవటం ఖాయమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: