ఆంధ్ర‌ప్ర‌దేశ్‌- తెలంగాణ రాష్ట్రాల దోస్తీలో కొత్త కోణం. ఇరు రాష్ర్టాలు త‌మ స‌మ‌స్య‌ల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి.దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశాన్ని తామే పరిష్కరించుకొంటామని రెండు తెలుగు రాష్ర్టాల అధికారులు కేంద్రానికి తెలియజేశారు. విభజన అంశాలపై చర్చించడానికి బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా నేతృత్వంలో రెండు రాష్ర్టాల అధికారుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు ఇతర ఉన్నతాధికారులు రామకృష్ణారావు, ప్రేమచంద్రారెడ్డి హాజరై ఈ మేర‌కు స్ప‌ష్ట‌త ఇచ్చారు.


నర్విభజన చట్టం షెడ్యూలు 9లోని 14 సంస్థల విభజనపై రెండు తెలుగు రాష్ర్టాల మధ్య సందిగ్ధత వీడలేదు. హెడ్‌క్వార్టర్ నిర్వచనంపై స్పష్టత లేదంటూ ఏపీ పెట్టిన పేచీ కారణంగా ఈ సంస్థల విభజన సందిగ్ధంలో పడటంతో.. ఒక్కో సంస్థపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలో..కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా స‌మావేశం ఏర్పాటు చేయ‌గా ఇరు రాష్ట్రాల అధికారులు హాజ‌ర‌య్యారు. గత ఏప్రిల్ 28న రెండు రాష్ర్టాల సీఎంల మధ్య ఈ అంశంపై చర్చ జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇద్దరు సీఎం లు సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకొంటారని కేంద్ర హోంశాఖకు వివరించారు.  ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనతోపాటు 9,10 షెడ్యూలు సంస్థల విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాల వంటి 9 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. 


9,10 షెడ్యూలు సంస్థల విభజనకు సంబంధించి ఇప్పటికే షీలాభిడే రూపొందించిన మార్గదర్శకాల మేరకు 68 సంస్థల విభజనకు సమ్మతం తెలిపినట్లు తెలంగాణ అధికారులు తెలిపారు. 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న కారణంగా ఆప్మెల్, సింగరేణి సంస్థల విభజన కూడా 42:58 దామాషాలో జరుగాలని ఏపీ పట్టుబట్టింది. కానీ, ఏపీ పునర్విభజనచట్టం 2014లోని షెడ్యూలు 12 సెక్షన్ 90 ప్రకారం ఏపీ డిమాండ్ పూర్తిగా చట్ట విరుద్ధమని తెలంగాణ కరాఖండిగా తేల్చిచెప్పింది. షీలాభిడే కమిటీ కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పిందని తెలంగాణ అధికారులు గుర్తుచేశారు. దీంతోపాటుగా త‌మ స‌మ‌స్య‌లు తామే చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకుంటామ‌ని వెల్ల‌డించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: