తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికపై కేసీయార్ ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కేసీయార్ ఇప్పటికే నియోజక వర్గ నేతలకు పలు సూచనలు చేయటం జరిగింది. 
 
కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో హుజూర్ నగర్ ఉపఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్న సీపీఐ ఇప్పుడు పునరాలోచనలో పడింది. సీపీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని చెప్పటం సీఎం కేసీయార్ నియంతృత్వ పోకడ అని అన్నారు. కేసీయార్ సెల్ఫ్ డిస్మిస్ ను వెనక్కు తీసుకోవాలని వెంకట్ రెడ్డి కోరారు. 
 
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో నిర్ణయం మర్చుకోని పక్షంలో సీపీఐ పార్టీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతుపై సమీక్షించుకునే అవకాశం ఉందని తెలిపింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ ఇలా ఎన్నో ఆందోళనలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చాడా వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. నియంతృత్వ వైఖరితో కేసీయార్ వెళుతున్నారని వెంకట్ రెడ్డి అన్నారు. 
 
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మద్దతు ప్రకటించిన సీపీఐ పార్టీ మద్దతును ఉపసంహరించుకుంటే కొంతవరకు టీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్పదు. మరోవైపు ఆర్టీసీ బస్సులు లేకపోవటంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేఖత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 48,000 మంది ఆర్టీసీ కార్మికులను తొలగించటం పట్ల ప్రజల నుండి కొంత వ్యతిరేఖత వస్తూ ఉండటం టీఆర్ఎస్ పార్టీ గమనించాల్సి ఉంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: