మ‌హ‌రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విమ‌ర్శ‌ల హీట్ పెరుగుతోంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మరో రెండు నెలల్లో 79వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ఆయన ఇప్పటికీ తాను యువకుడినేనని అన్నారు. మహారాష్ట్రలోని బాలాపూర్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతూ  రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వాన్ని ఇంటికి పంపిన తర్వాతే తాను విశ్రాంతి తీసుకుంటానన్నారు.


కాగా, ఇటీవ‌ల ప‌వార్‌పై ఈడీ కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. మహారాష్ర్ట కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో నగదు అక్రమ చలామణీకి పాల్పడ్డారన్న అభియోగాలపై శరద్‌పవార్‌తో పాటు పలువురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పవార్‌కు ఈడీ ఎలాంటి సమన్లు జారీ చేయలేదు. అయినప్పటికీ తాను ఈడీ ఎదుట హాజరవుతానని  శరద్‌ పవార్‌  వెల్లడించారు. అనంత‌రం పవార్‌ను ఆయన నివాసంలో కలిసిన ముంబై పోలీసు కమిషనర్‌ సంజయ్‌ బర్వె ఈడీ కార్యాలయానికి వెళ్లొద్దని, నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పవార్‌ తన ప్రణాళికను రద్దు చేసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత ఆయ‌న మహారాష్ట్రలో బీజేపీ-శివసేనను ఓడించే వరకు విశ్రాంతి తీసుకోనని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.


ఇదిలాఉండ‌గా, హ‌ర్యానా ఎన్నిక‌ల టికెట్ల కేటాయింపులో ఆస‌క్తిక‌ర ప‌రిణామం జ‌రిగింది. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్‌ ఖాలిద్‌పై దాడి చేసిన నిందితుడు నవీన్‌ దలాల్‌ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శివసేన టికెట్‌పై బహదూర్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. నవీన్‌ దలాల్‌ మాట్లాడుతూ గోవులు, రైతులు, అమరవీరులు, పేదల పేరుతో బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. శివసేన ఇలాంటి రాజకీయాలు చేయదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: