జిల్లాల పర్యటన మొదలుపెట్టిన చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. జిల్లాల పర్యటనను చంద్రబాబు విశాఖపట్నంతో మొదలుపెట్టారు. ఇందుకోసం మాజీ సిఎం గురు, శుక్రవారాల్లో విశాఖపట్నం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు.  ఈ పర్యటనతో జిల్లాలోని నేతల పరిస్ధితేంటో దాదాపు తేలిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.


మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత మొట్టమొదటసారి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. అప్పుడు కూడా రెండు రోజులు జిల్లాలో పర్యటించిన చంద్రబాబుకు షాక్ కొట్టింది. మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్ధులతో పాటు చాలామంది సీనియర్ నేతలు అసలు అడ్రస్సే లేరు.

 

తన పర్యటనలో చాలామంది సీనియర్లు గైర్హాజరును గుర్తించిన చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసినా పెద్దగా ఎవరూ స్పందించలేదు. ఈ విషయమై తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో చేసేది లేక హాజరైన వారితోనే సమావేశం నిర్వహించాల్సొచ్చింది.

 

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఎదురైన అనుభవంతో మళ్ళీ జిల్లాల పర్యటనలను చంద్రబాబు పెట్టుకోలేదు. ఇంటికి, పార్టీ కార్యాలయానికే పరిమితమైపోతే కష్టమని గ్రహించటంతో మళ్ళీ జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారు.

 

విశాఖ జిల్లాలోని తమ్ముళ్ళ వ్యవహారాలు కూడా బాగా ముదిరిపోయాయి. ఇక్కడ కూడా చాలామంది నేతలకు ఒకరంటే మరొకరికి పడటం లేదు. మంత్రులుగా చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు ఉప్పు-నిప్పు. మొన్నటి ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో టిడిపి గెలిచింది సిటిలోని 4 నియోజకవర్గాల్లోనే. దాంతోనే నేతల మధ్య ఉండే కుమ్ములాటలన్నీ బహిర్గతమయ్యాయి.

 

అమరావతిలో చంద్రబాబు నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకు కూడా ఉత్తరాంధ్ర ప్రధానంగా విశాఖ జిల్లా నేతల నుండి హాజరవుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. గంటా, పంచకర్ల రమేష్ లాంటి  చాలామంది నేతలు వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకనే పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలామంది పాల్గొనటం లేదు. ఈ నేపధ్యంలోనే  చంద్రబాబు జిల్లా పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత పెరిగిపోయింది. మరి ఈ జిల్లాలో చంద్రబాబుకు ఎటువంటి షాక్ తగులుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: