ఆంధ్ర్రప్రదేశ్ లో మ‌రో ప్రతిష్ఠాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌. ప్రజలందరికీ కంటి సమస్యలు దూరం చేయడానికి బృహత్తర కార్యక్రమం అమలు చేయనుంది.  ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా 'వై.ఎస్.ఆర్. కంటి వెలుగు' కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌  ఈ రోజు అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు 5 కోట్ల 40 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. 


ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం మరో కీలక పథకాన్ని చేపట్టారు. అనంత‌పుర‌ం జిల్లాలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు జగన్.  వై.ఎస్.ఆర్ కంటి వెలుగులో భాగంగా మొదట విడ‌త‌లో సుమారు 70 లక్షల బడిపిల్లలకి  ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ కంటిచూపు దినోత్సవం  సందర్భంగా శ్రీకారం చుట్టే ఈ పరీక్షలు ఈ నెల 16 వరకు జరగనున్నాయి. కంటి సమస్యలున్న వారిని గుర్తించి.. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ విజన్‌ సెంటర్లకు పంపిస్తారు. కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు జిల్లాస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 


ఈ కార్యక్రమం ద్వారా కంటి పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకు అన్ని సేవలనూ ఉచితంగా కల్పించనుంది ప్రభుత్వం.  70 లక్షల మందికి పైగా స్కూలు విద్యార్థులకు మొదటి విడతలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలు  అందిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. మొత్తం ఆరు దశల్లో.. మూడేళ్ల పాటు ఈ కార్యక్రమం అమలుకానుంది.  


పథకం అమలుకు అవసరమైన  సిబ్బందిని ఇప్పటికే నియమించింది ఏపీ సర్కార్‌. వీరిలో 160 మంది జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులు ఉన్నారు.  కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లు ఇప్పటికే పి.హెచ్.సిలకు చేరుకున్నాయి. ఆశావర్కర్లు, టీచర్లు, ఎ.ఎన్.ఎమ్ లను ఈ పథకానికి అనుసంధానం చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: