రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పాలనలో పారదర్శకతకు.. రివర్స్‌ టెండరింగ్‌లో మరింత లబ్ధి కలిగేలా ఆదేశాలిచ్చారు సీఎం జగన్‌. బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి అరవై శాతం మందికే రివర్స్ టెండరింగ్ లో ఛాన్స్ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. పోటీని పెంచి...ఎక్కువ ప్రజాధనం ఆదా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది ప్రభుత్వం.  


100 కోట్లు పైబడ్డ కాంట్రాక్ట్  పనులను ముందస్తు న్యాయ సమీక్షకు నివేదించడంద్వారా దేశంలో అత్యుత్తమ పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వై.యస్‌.జగన్‌ మరో ముందడుగు వేశారు.  10లక్షలు ఆ పైబడ్డ విలువైన పనులు, సర్వీసులు, కొనుగోళ్ల కోసం నిర్వహించే టెండర్లలో పారదర్శకతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల ప్రకారం జనవరి 1నుంచి కొత్తపాలసీ అమల్లోకి కానుంది. ఈలోగా ప్రస్తుతం ఉన్న ఇప్రొక్యూర్‌ మెంట్‌ ఫ్లాట్‌ఫాం మీదే సాధ్యమైనంతమేర పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 


ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు,  ప్రజాధనం ఆదాకోసం క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రివర్స్‌ టెండరింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి  కనీసం ఐదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60శాతం మందికే  రివర్స్‌ టెండరింగ్‌కు అర్హులయ్యేలా చూడాలన్నారు. దీనివల్ల బిడ్డింగ్‌ ప్రక్రియలో కోట్‌ చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని, రివర్స్‌ టెండరింగ్‌లో మరింత పోటీకి దారితీస్తుందని సీఎం అన్నారు. 


తక్కువ ధరకు కోట్‌ చేసిన టెండర్‌ వివరాలను ఇప్రొక్యూర్‌ మెంట్‌ సైట్‌లో డిస్‌ప్లే చేయాలని, వారం రోజులపాటు ఈ వివరాలు అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆతర్వాత రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు..  కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని కూడా సీఎం ఆదేశించారు. ప్యాకేజీలు కూడా ఎక్కువ మంది పోటీకివచ్చేలా, పాల్గొనేలా చూడాలన్నారు. ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల టెండర్లలో ఇప్రొక్యూర్‌ మెంట్, జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ పక్రియలు సాఫీగా జరిగేలా సహకారం అందించేందుకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూకు అవసరమైన వివరాలు అందించడానికి, ప్రాధాన్యాలను  నిర్దేశించడానికి ఈ అధికారి పనిచేస్తారని ముఖ్యమంత్రి చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: