బలహీనమైన ప్రతిపక్షాలు, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీల్లో నాయకత్వ లేమి... వలస రాజకీయాలు! వెరసి... ఈ నెల 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ... శివసేనతో కలిసి మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు మెరుగయ్యాయి. కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమితో పోలిస్తే రాజకీయంగా బీజేపీ–శివసేన ఎన్నో మైళ్ల ముందుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోరపరాభవానికి గురైన కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఆ తరువాత కీలక నేతల వలసలతో దాదాపుగా కుదేలైంది. గత మూడు నెలల్లో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీవైపు మళ్లడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఒక్కతాటిపై ఉంచగలిగే వారు లేకుండా పోయారు. సంప్రదాయ ఓటుబ్యాంకు కూడా కకావికలమైపోయింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఈ సారి గెలుపు మాదేనన్న ధీమాతో ప్రచార బరిలోకి దిగడం గమనార్హం.   

ఎన్‌సీపీకి రెండు సమస్యలు

పార్టీ ఎమ్మెల్యేలు అటు బీజేపీలోకి లేదంటే శివసేనలోకి వెళ్లిపోవడం ఒక్కటే శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ఎదుర్కొంటున్న సమస్య కాదు. ఈ వలసల కారణంగా దశాబ్దాలుగా తమకు పట్టున్న పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో పార్టీ బలహీనడిందన్నది వాస్తవం. దీంతోపాటు మహారాష్ట్ర సహకార బ్యాంకు స్కామ్‌లో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తోపాటు అజిత్‌ పవార్‌లు చిక్కుకోవడంతో పార్టీ పరువు మరింత పోయినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.


రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం...

మళ్లీ పగ్గాలు చేపట్టడంలో, వారసుడి ఎంపికలో సోనియాగాంధీ చేసిన జాప్యం కారణంగా పార్టీ సంస్థాగతంగా భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, ఎన్సీపీలు హంగు, ఆర్భాటాలు, చర్చల్లాంటివేవీ లేకుండానే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఐదు రోజులు ముందే పొత్తు, సీట్ల పంపిణీ ఫార్ములా ఖరారు చేసుకుని ప్రచార బరిలోకి దిగేశాయి. ఇరు పార్టీలు చెరి 125 స్థానాల్లో పోటీపడుతూండగా మిగిలిన 38 సీట్లు కూటమిలోని చిన్న పార్టీలకు కేటాయించాయి.


ఓట్లు లెక్కలూ బీజేపీకే అనుకూలం..

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేసినప్పటికీ ఇరు పార్టీలకు పోలైన ఓట్లు యాభై శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. బీజేపీ 27.59, శివసే, 23.29 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్, ఎన్సీపీలకు 16.27 శాతం, 15.52 శాతం ఓట్లు దక్కాయి. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అత్యధికంగా 122 స్థానాలు గెలుపొందగా శివసేన 63 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్‌ 42 సీట్లు, ఎన్‌సీపీ 41 స్థానాలు మాత్రమే గెలిచాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఈ సారి అసెంబ్లీకి పోటీ చేస్తోంది. 


ఆర్మీ పేరుతో ఇందిర ఓట్లు అడగలేదు

సైనికుల పేరు చెప్పి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నడూ ఓట్లు కోరలేదని, కానీ ప్రధాని మోదీ మాత్రం ఆ పని చేశారని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ విమర్శలు సంధించారు. ‘‘ఆర్మీ పరాక్రమాన్ని చూపించి ఇందిరాగాంధీ ఓట్లు అడగలేదు. కానీ దేశం కోసం జరిగిన కీలక యుద్ధాల్లో విజయం వారి ఘనతగానే చెప్పారు. కానీ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జాతి భద్రత అంశాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించుకున్నారు’’అంటూ మహారాష్ట్రలోని బాలాపూర్‌ పట్టణంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.  


కాంగ్రెస్‌లోకి ఐఎన్‌ఎల్‌డీ మాజీ ఎంపీలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న సమయంలో ఐఎన్‌ఎల్‌డీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు కాంగ్రెస్‌లో గూటిలోకి చేరిపోయారు. చరణ్‌సింగ్‌ రోరి, సుషీల్‌కుమార్‌ ఇండోరా మంగళవారం సిర్సాలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ కుమారి శెల్జా సమక్షంలో పార్టీలో చేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: