తెలంగాణలో తొలిరోజే మద్యం  దుకాణాల నిర్వహణకు ఔత్సాహికుల నుంచి  అనూహ్య స్పందన లభించింది . దసరా పండుగ మరుసటి రోజే  దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా,  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 233 దరఖాస్తులు వచ్చాయి.  పండుగ మరుసటి రోజే అయినా ,  ఆశావాహులు వెనువెంటనే స్పందించడం పరిశీలిస్తే ఈసారి మద్యం దుకాణాల నిర్వాహణ ఔత్సాహికుల నుంచి   దరఖాస్తులు వెల్లువలా వచ్చే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు .

 

 గతనెల నే పాత మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ , ఒక నెలపాటు వారికి గడువు ను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం , నూతన లైసెన్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించింది .  రిటైల్ షాప్ లో ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు దరఖాస్తులను స్వీకరించే విధానం పై ఆశావాహులు ఆరాతీస్తున్నారు.  రాష్ట్రంలో 33 జిల్లాలో 34 రిటైల్ అప్లికేషన్ సెంటర్లను ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది . ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు  ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.  13వ తేదీ ఆదివారం కావడంతో దరఖాస్తులు తీసుకోవడం లేదని చెప్పారు.  ఈనెల 18వ తేదీన డ్రా ద్వారా షాపులను  కేటాయించనున్నట్లు వెల్లడించారు . 

 

ఈ నెల 30వ తేదీ లోపు కొత్త మద్యం దుకాణాలను దక్కించుకున్న  యజమానులకు లైసెన్సులు అందజేసి,  నవంబర్ ఒకటో తేదీ నుంచి నూతన యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు కొనసాగించనున్నారు.  పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర  ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండగా తెలంగాణలో మాత్రం పాత విధానాన్ని కొనసాగించడానికి కేసీఆర్ సర్కార్ సుముఖంగా ఉన్నట్లు మద్యం దుకాణాలకు  నోటిఫికేషన్ జారీ ద్వారా చెప్పకనే చెప్పింది .


మరింత సమాచారం తెలుసుకోండి: