ఆర్టీసీ కార్మికుల  సమ్మె పట్ల  ప్రభుత్వం చేస్తోన్న వాదన పై  హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది . ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని  హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.  సమ్మె సందర్భంగా ప్రజలకు ఎటువంటి  ఇబ్బందులు తలెత్తకుండా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం,  న్యాయస్థానానికి విన్నవించింది . ప్రభుత్వ  వాదనలతో ఆర్టీసీ కార్మికుల తరఫున వాదించిన న్యాయవాది విభేదిస్తూ ,  చట్టబద్ధంగానే ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నారని న్యాయస్థానికి తెలిపారు.


 ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది … ఆర్టీసీ యూనియన్ల వైఖరి వల్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.  ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది.  ఈనెల 15లోగా పూర్తి వివరాలతో ఆర్టీసీ యాజమాన్యం … కార్మికు లు కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది . తదుపరి విచారణను ఈనెల 15 వ తేదీకి న్యాయస్థానం  వాయిదా వేసింది. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె ఆరో రోజుకు చేరుకుంది.  సమ్మెలో భాగంగా ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు ధర్నాలు,  నిరసన ప్రదర్శనలు చేపట్టారు.   ఆర్టీసీ కార్మికులకు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ ,  ధర్నాలు,  నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు.


చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నట్లుగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 48 వేలకు పైగా కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే . అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమని తొలగిస్తున్నట్లు ఎటువంటి నోటీసులు అందలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల జే ఏ సీ నేతలు తెలిపారు . ఒకవేళ నోటీసులు అందితే తప్పకుండా తాము స్పందిస్తామని చెప్పారు . ఒక వైపు కార్మికులు తమని తొలగించినట్లుగా నోటీసులు అందలేదని చెబుతున్నప్పటికీ , మరొకవైపు నూతన నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీ అవుతోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: