తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్యకర్తలపై మాస్ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఇకపై వారెవరూ ఉద్యోగంలోకి రావాల్సిన అవసరం లేదని... వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇకపోతే తెలంగాణలోనే అతి పెద్ద పండుగ అయిన దసరాకి వారికి జీతాలు కూడా అందకపోగా ఆర్టీసీ కార్మికులు ఇంట్లో పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా అన్నీ భరించి అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మరో మోసం వెలుగు చూడడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. వారి కష్టార్జితం అయిన 1800 కోట్ల రూపాయలు మాయం అవడంతో ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది.


విషయం ఏమిటంటే తెలంగాణ ఆర్టీసీ పీఎఫ్ ఖాతా లో ప్రతి నెల ఉద్యోగి భద్రత కోసం పిఎఫ్ పేరుతో కొంత మొత్తం వసూలు చేస్తారు. ఆ మొత్తానికి ఆర్టీసీ యాజమాన్యం మరికొంత జతచేస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుండి ఏకంగా 826 కోట్ల రూపాయలు జమ చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం వారు వాడేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా పీఎఫ్ నగదు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పెండింగ్ లో పెట్టగా... అంతా కలిసి మూకుమ్మడిగా ఆరాతీయగా దాదాపు వెయ్యి కోట్లు మాయమైన విషయం వెలుగుచూసిందట. ఇలా దాదాపు ఏడు వేల దరఖాస్తులు నిలిచిపోయాయి.

పీఎఫ్ కార్యాలయం లో ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న ఒక ట్రస్టు ఖాతాలో నుంచి కూడా వెయ్యి కోట్ల రూపాయలు మాయం అయినట్లు తేలడం గమనార్హం. ఇలా మొత్తం డబ్బు పీఎఫ్ ఖాతాలో జమ కాకపోవడంతో పిఎఫ్ కమిషనర్ రెండుసార్లు ఆర్టీసీకి షోకాజ్ నోటీసులు పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు పిఎఫ్ సొమ్ము కోర్టు నుంచి స్టే తెచ్చుకుని మరీ బదలాయించకుండా ఆపేసిందట. ఇప్పుడు కార్మికులు అవసరాల కోసం దాచుకున్న డబ్బును వాడేసుకోవడం ఏమిటని వారిపై భగ్గుమంటున్నారు. కనీసం ఈ విషయంలో అయినా వారికి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: