వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలైంది. సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తమ గోడు ఆలకించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో సుమారు రూ. 7,000 కోట్లకు పైగా పనులు స్తంభించిపోయాయి. ప్రధానంగా రూ. 5,000 కోట్ల సాగునీటి ప్రాజెక్టుల పనులు రద్దయ్యాయి. అలాగే వివిధ శాఖలకు సంబంధించి రూ. 2వేల కోట్ల పనులు స్తంభించిపోయాయి.

ఎన్నికల ముందు తన వాగ్దానాలతో ప్రజల్లో ఆశలు రేపిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తరువాత తన పరిపాలనాతీరుతో ప్రజల్లో అభద్రతాభావం కలిగిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇందులో భాగంగా పురోగతిలో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మూడునెలలు పైబడుతున్నా అతీగతీ లేకపోవడంతో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది.

ప్రధానంగా జిల్లాకు జీవనాడుల్లాండి పేరూరు, బీటీపీ, అప్పర్‌ పెన్నార్‌, చిత్రావతి వంటి ప్రాజెక్టుల పనులు రద్దు చేయడంతో జగన్‌ ప్రభుత్వం జిల్లా ప్రజలకు ఏవిధంగా భరోసా కల్పిస్తుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులతోపాటు సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎ్‌సఏ), ఉపాధిహామీ, మినీ గోకులాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వంటి పనులు కూడా స్తంభించిపోయాయి. దీనిపై సీఎం జగన్‌ దృష్టి సారించి జిల్లా ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 రద్దయిన సాగునీటి ప్రాజెక్టులివే..


జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనుల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 తరువాత జీవోలు విడుదలైనవాటిని పూర్తిగా రద్దు చేయాలని అప్పట్లో కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందే జీవోలు జారీ చేసి పనులు ప్రారంభించినవైనా మొత్తం వ్యయంలో 25శాతం లోపు పనులు జరిగినవి కూడా రద్దు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
దీంతో కాంట్రాక్టర్లు ఆయా పనులు నిలిపివేశారు. ఫలితంగా కరువు పీడిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులు రద్దు చేసి మూడునెలలు పైబడినా ఇప్పటికీ అతీగతీ లేకపోవడంతో జిల్లా ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ ఏడాది తప్పనిసనరిగా తమకు నీరందుతుందని ఆశలు పెట్టుకున్న రైతులు ప్రభుత్వ తీరుతో కుదేలైపోతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: