తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. సమ్మె ప్రారంభించిన రోజున కార్మికులు కానీ ప్రజలు కానీ సమ్మె తీవ్రత ఈస్థాయిలో పెరిగిపోతుందని ఊహించలేదు. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి తీసుకున్న నిర్ణయంతో ఈ సమ్మె ఓ యుద్ధంలా మారిపోయింది. ప్రభుత్వం – కార్మికులు ఎవరూ వెనక్కితగ్గకిపోగా సమస్య ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లిపోయింది.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, పెండింగ్ బకాయిలు, జీతాలు పెంచడం.. వంటి డిమాండ్లతో కార్మికులు చేపట్టిన సమ్మె రోజుకో టర్న్ తీసుకుంటోంది.

 

 

ఆర్టీసీపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ లో ఈరోజు కార్మికులు తమ సమస్యలపై భారీ ర్యాలీ తలపెట్టారు. అయితే ఈ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీలో భాగంగా గురువారం ఉదయం అదాలత్ సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది క్రమంగా తోపులాటకు దారితీసింది. మహిళా కార్మికులను సైతం పోలీసులు నెట్టివేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ, పలువురు గాయపడినా కూడా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు

 

 

 కార్మికుల సమ్మెపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఐదో తేదీ సాయంత్రం వరకూ డెడ్ లైన్ విధించినా కార్మికులెవరూ వెరవలేదు. దీంతో 48,600 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది. కొత్తవారిని విధుల్లోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. దీనిపై కార్మికులు న్యాయ పోరాటం చేస్తున్నారు.

.


మరింత సమాచారం తెలుసుకోండి: