తెలంగాణాలో గత ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సమ్మె కారణంగా రాష్ట్రంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రైవేట్ బస్సులు బాదుడు బాదుతున్నాయి.  రోజు 20 రూపాయలతో ఆఫీస్ కు వెళ్లొచ్చే ప్రజలు రోజుకూ 200 ఖర్చు చేసుకుంటూ ఆఫీస్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.  మెట్రో లో ప్రయాణం చేస్తున్నా.. మెట్రో నుంచి ఆఫీస్ కు వెళ్ళడానికి సాధారణ రోజుల్లో ఉండే ఆటో చార్జీల కంటే.. ఇప్పుడు చార్జీలు భారీగా ఉంటున్నాయి.  


ఈ పరిస్థితికి కారణాం సమ్మె అని ప్రజలు వాపోతున్నారు.  ఆర్టీసీ సమస్యలు త్వరగా పరిష్కరించి ఇబ్బందుల నుంచి తప్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై స్పందించిన కోర్టు ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు నోటీసులు పంపింది. అయితే, కార్మికులు తమ వెర్షన్ ను కోర్టు ముందు ఉంచారు.  తమవి న్యాయబద్ధమైన డిమాండ్లే అని.. ఆర్టీసీకి నోటీసులు ఇచ్చినా దానిపై స్పందించలేదని తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు.  


అయితే, దీనిపై స్పందించిన ప్రభుత్వం సమ్మె  వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టుగా ప్రభుత్వం చెప్పింది.  అయితే, ప్రభుత్వం పేర్కొన్న దానిపై హైకోర్టు సంతృప్తి చెందలేదు.  ప్రభుత్వం చెప్తున్నట్టుగా కాకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనిపై సమగ్రమైన కౌంటర్ దాఖలు  చేయాలనీ కోర్టు సూచించింది.  తదుపరి విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది.  


ఇక ఇదిలా ఉంటె, ఆర్టీసీ సమ్మె తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించిన సమగ్ర నివేదికను హైకోర్టుకు అందజేసింది.  ఈ నివేదిక   ప్రకారం.. ప్రజా రవాణాకు 8150 వాహనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం నివేదికలో పేర్కొన్నది.  ఇందులో 3013 ఆర్టీసీ, 1804 అద్దె, 696 ప్రైవేట్, 2637 మ్యాక్సీ క్యాబ్ లను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం పేర్కొన్నది.  ఇక తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను, కండక్టర్లను నియమించినట్టు ప్రభుత్వం నివేదికలో పేర్కొనడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: