తెలంగాణ హైకోర్టు ఆర్టీసీ కార్మికుల సమ్మె కేసు విషయంలో దాదాపు కార్మిక సంఘాల వైపే మొగ్గుచూపింది అనే చెప్పాలి. గురువారం హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది రామచందర్  రావు మరియు ఆర్టీసీ కార్మిక సంఘాల తరపున న్యాయవాది రచనా రెడ్డి తమ వాదనలను వినిపించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కార్మికుల తరపు న్యాయవాది కోరగా ప్రభుత్వం తరఫు న్యాయవాది మాత్రం సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం పప్పులు కోర్టు ముందు ఏ మాత్రం ఉడకలేదు. తక్షణమే తమకు అనుకూలంగా వస్తుందనుకున్న తీర్పు కాస్త దాదాపు అడ్డం తిరిగింది అనే చెప్పాలి.

గురువారం హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల తరఫున న్యాయవాది రచనా రెడ్డి కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ముందుగానే నోటీసులు ఇచ్చారని కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతోనే సమ్మె బాట పట్టారని హైకోర్టుకు తెలిపారు. సెప్టెంబర్ 3, 24 మరియు 26 తేదీల్లో కార్మికులు నోటీసు ఇవ్వగా ప్రభుత్వం వాటిని విస్మరించిన సంగతిని తెలియజేశారు. ఇకపోతే ప్రభుత్వం తరఫు న్యాయవాది కార్మికులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన మాట నిజమేనని కాకపోతే కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపే సమయాన్ని ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు. ఇకపోతే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 29వ తేదీన సునీల్ శర్మ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. కానీ ఆ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోక ముందే కార్మికులు సమ్మెలోకి వెళ్లారని... ఈ సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 

ఇరువురి వాదనలు విన్న కోర్టు తక్షణమే కార్మికుల సమ్మె ఆపివేయాలని ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోగా కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఈనెల 15వ తేదీ వరకు సమ్మెను కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతుంది. ఇక రానున్న రోజుల్లో హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కానీ ఇప్పుడు వేసిన వాయిదా తో సమ్మె పొడిగించడం కేసిఆర్ కు పెద్ద దెబ్బ అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: