నోబెల్ పుర‌స్కారం గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అందులోనూ...రాజ‌కీయ ఒత్తిళ్లు ఎక్కువ‌గా ఉండే...``నోబెల్ శాంతి బ‌హుమ‌తి``కి పోటీ ప‌డే వారి సంఖ్య గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే, ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందనే అంశంలో ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. స్వీడ‌న్‌కు చెందిన‌ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు ఈ ఏడాది అవార్డు ద‌క్కుతుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 16 ఏళ్ల వ‌య‌సుగ‌ల ఈ అమ్మాయికి అవార్డు ఎందుకు ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిని రేకెత్తించే అంశ‌మే.


స్వీడన్‌ పార్లమెంట్‌ ఎదుట పర్యావరణ మార్పులపై నిరసన తెలుపడం ద్వారా గ్రెటా తన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా ఒంటరిగా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై విపరీతమైన చర్చ జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో గ్రెటాకే నోబెల్‌ శాంతి బహుమతి లభించే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. అనేక అంతర్జాతీయ వేదికలపై గ్రెటా ప్రసంగించింది. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ‘హౌ డేర్‌ యూ?’ అంటూ ప్రపంచ దేశాల అధినేతలను నిలదీసింది. ఆమెను ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు వరించాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ప్రత్యామ్నాయ నోబెల్‌గా పిలిచే.. ద రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డ్‌ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.కొంద‌రు నిపుణులు మాత్రం.. గ్రెటా చేసిన కృషి అద్భుతమని ప్రశంసిస్తూనే, ఆమె వయసు దృష్ట్యా ఇప్పుడే నోబెల్‌ ఇవ్వడం సరికాదని పేర్కొంటున్నారు. 


ప్రస్తుత పరిస్థితులు మాత్రం పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు అనుకూలంగా ఉండగా, నిపుణులు మాత్రం ఇతరులకు ఓటేస్తున్నారు. మిగతా రంగాల్లో కృషి చేసినవారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. కొందరు ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్‌ పేరును సూచిస్తున్నారు. నిత్యం ఘర్షణలు, అంతర్యుద్ధంతో రావణకాష్టంలా మండుతున్న ఇథియోపియాలో, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో అబే అహ్మద్‌ మార్పు తీసుకొచ్చారని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా శాంతి నెలకొన్నదని చెప్పారు. మరికొందరు విశ్లేషకులు ఐదుగురు సభ్యుల అంతర్జాతీయ కమిటీ, రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ (ఆరెస్సెఫ్‌), కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజే), యూఎన్‌హెచ్‌సీఆర్‌ వంటి పేర్లను సూచిస్తున్నారు. ఇదిలాఏంండ‌గా. ఈ ఏడాది వచ్చిన నామినేషన్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 301 మంది వ్యక్తులు, సంస్థల పేర్లు ఉన్నాయి. అయితే వీరిలో తుది జాబితాలో ఎవరు ఉన్నారనే విషయాన్ని నోబెల్‌ కమిటీ బహిర్గతం చేయదు.


మరింత సమాచారం తెలుసుకోండి: