ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఢిల్లీ టూర్ ర‌ద్దు అయింది. శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం జగన్ పర్యటన చివ‌రి నిమిషంలో క్యాన్స‌ల్ అయింది. కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసేందుకు జగన్‌ ఢిల్లీ వెళ్లాల్సి ఉండ‌గా...అది హ‌ఠాత్తుగా ర‌ద్ద‌యింది. ఇందుకు అమిత్‌షా నిర్ణ‌య‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.  ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు జ‌గ‌న్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. 


ఈనెల 5వ తేదీనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధానితో సీఎం చర్చించారు. ప్రధానంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా చర్చించారు. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించారు.


అయితే, దీనికి కొన‌సాగింపుగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా,  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం అయ్యేందుకు జ‌గ‌న్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. . గత పర్యనటలోనే ఆయన అమిత్ షా తో పాటుగా ఆర్దిక మంత్రిని కలవాలని భావించినా సాధ్యపడలేదు. ఈ సారి వారిద్దరితో పాటుగా జల వనరుల శాఖా మంత్రి షెకావత్ ను సైతం కలవాలని నిర్ణయించారు. దీంతోపాటుగా, ఏపీలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులతో పాటుగా.. కేంద్రం నుండి రావాల్సిన సాయం గురించి అమిత్‌షాతో చర్చించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక, కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్దిక పరిస్థితిని వివరించడం, రెవిన్యూ లోటు భర్తీని త్వరిత గతిన పూర్తి చేయాలని కోరడం ప్ర‌ధాన అజెండాగా పెట్టుకున్నారు.  అయితే, చివ‌రి నిమిషంలో ఈ టూర్ ర‌ద్దు అయింది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా బిజీగా ఉన్నారు. అందువల్ల ఢిల్లీ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: