గ‌త కొద్దికాలంగా...ప్లాస్టిక్‌పై వివిధ ప్రాంతాల్లో ఆస‌క్తిక‌ర రీతిలో పోరాటం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌పై అవ‌గాహ‌న కోసం ప‌లు ర‌కాలైన కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌ కోసం డ‌బ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్లి ఇస్తే.. చాలు ఉచితంగా కడుపు నిండా భోజనం పెట్టే ఆఫ‌ర్‌ను చత్తీస్‌గడ్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ప‌థ‌కానికి ఆస‌క్తిక‌రంగా పెద్ద ఎత్తున స్పంద‌న వ‌స్తోంది. అదే స‌మ‌యంలో...వ్య‌ర్థాలు సైతం శుద్ధి అవుతున్నాయి. 


చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రంలోని అంబికాపూర్‌లో సరికొత్త ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒక కిలో ప్లాస్టిక్ వేస్ట్ తీసుకొచ్చేవారికి భోజనం, 500 గ్రాముల ప్లాస్టిక్ తీసుకొచ్చేవారికి బ్రేక్‌ ఫాస్ట్ పెడతామని నిర్వాహకులు తెలిపారు. ఇలా సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపాలిటీ రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తామని చెబుతున్నారు.  ఈ స్కిమ్ కింద నిరాశ్రయులకు వసతి సదుపాయం కూడా కల్పిస్తామని వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ నిరాశ్రయుల కోసం దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన గార్బేజ్ కేఫ్‌ను ఆరోగ్యశాఖ మంత్రి టిఎస్ సింగ్‌ డియో ప్రారంభించారు.


కాగా, వ‌రంగ‌ల్ జిల్లా రఘునాథపల్లి మండ‌లం వెల్ది గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు మండలంలోని గ్రామసభలో సర్పంచ్‌ వినూత్న ఆఫర్‌ను ప్రకటించాడు. విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్‌తో అపరిశుభ్రత చోటు చేసుకుంటుందని గ్రామస్తులు వాపోయారు. ప్లాస్టిక్‌ గ్లాసులు, కవర్లు ఊరంతా చెల్లాచెదురుగా పడుతున్నాయని వీటిని పూర్తిగా నివారించాలని గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సర్పంచ్‌ మల్లేష్‌ మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్‌ సేకరించి పంచాయతీకి అప్పగిస్తే కిలోకు రెండు కిలోల సన్నబియ్యం ఇస్తామని ప్రకటించాడు. వీధుల్లో చెత్త వేస్తే రూ 500 జరిమానా, చెత్త వేసిన వారి సమాచారం ఇస్తే రూ.250 నగదు బహుమతి అందజేస్తామన్నారు. ప్రతీ నెల 15, 30 తేదీలలో ఇంటింటా శుభ్రత చేయాలని గ్రామసభలో తీర్మాణం చేయగా గ్రామస్తులంతా ఏకీభవించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: