ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే వారితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ముఖ్యమంత్రి  కేసీఆర్ , టి - ఎన్జీవో  నేతలను ప్రగతిభవన్ కు  పిలిపించుకుని వారితో చర్చలు జరపడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది . గత ఏడాది కాలంగా పీఆర్సీ పై చర్చించడానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ , ఉన్నట్టుండి గురువారం ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకుని చర్చలు జరిపారు . ఉద్యోగులకు  కరువు భత్యం 3 .5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు . 


అఖిలపక్షం తో ఆర్టీసీ జాక్ నేతలు  మరోమారు భేటీ అవుతున్న నేపధ్యం లో , అంతకంటే ముందుగానే టి ఎన్జీవో నేతలతో కేసీఆర్ సమావేశం కావడం హాట్ టాఫిక్ గా మారింది .    ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాలు ఎక్కడా  మద్దతునిస్తాయోనన్న ఆందోళనతోనే , ముఖ్యమంత్రి ఈ విధంగా  వ్యవహరించినట్లు  స్పష్టం అవుతోందని సోషల్ మీడియా వేదిక పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు  . ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దన్నుగా నిలిచే అవకాశాలు లేకపోలేదని భావించిన కేసీఆర్ విభజించు -పాలించు అనే ఎత్తుగడ వేశారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .


 ఇక కేసీఆర్ చర్యలపై  సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఆర్టీసీ కార్మికులను ఒంటరి చేసి సమ్మె విచ్చిన్నం చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని జాక్ నేతలు ఆరోపిస్తున్నారు . ఈ మేరకు గవర్నర్ తమిళిసై ని కలిసిన ఆర్టీసీ జాక్ నేతలు , సమ్మెకు దారితీసిన పరిస్థితులను వివరించారు . కేసీఆర్ తీరుపై దుమ్మెత్తిపోశారు . అయితే ముఖ్యమంత్రి తో భేటీ అనంతరం టి -ఎన్జీఓ నేతలు తమకు కరువు భత్యం పెంచినందుకు కనీసం హర్షం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన కూడా విడుదల చేయకపోవడాన్ని పరిశీలిస్తే , కేసీఆర్ తమలో తమకే పంచాయితీ పెట్టి తమాషా చూడాలని ఎత్తుగడ వేశారని గ్రహించి ఉంటారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: