వైసీపీలో ఎన్నికల ముందు చేరిన ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉంటారా ఉండరా అన్న చర్చ వేడిగా సాగుతోంది. దగ్గుబాటి ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో చేరారు. ఆయన్ని గౌరవించి ప్రకాశం జిల్లా పరుచూరి టికెట్ జగన్ ఇచ్చారు. అయితే ఆయన వైసీపీ గాలిలో కూడా ఓడిపోయారు. నాటి నుంచి ఆయన జగన్ని కలిసింది లేదని అంటున్నారు.


ఇక జగన్ సైతం ఓడిపోయిన తరువాత దగ్గుబాటి పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంలేదని భావించి పాత ఇంచార్జికే తిరిగి బాధ్యతలు అప్పగించేశారు. దాన్ని ఇపుడు దగ్గుబాటి అవమానంగా భావిస్తున్నారట. తాను సీనియర్ నేతనని,  ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చేశానని ఆయన తన సన్నిహితులతో అన్నట్లు భోగట్టా. తాను పార్టీలో చేరిన తరువాత వైసీపీకి వూపు వచ్చిందని కూడా అంటున్నట్లు సమాచారం.


సీనియర్ మోస్ట్ లీడర్ అయిన తనని జగన్ అవమానిస్తున్నారని బాధపడుతున్న దగ్గుబాటి ఇపుడు వైసీపీ నాయకత్వంపై గుస్సా అవుతున్నారట. మరి దగ్గుబాటి నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆయన సన్నిహితులు కలవరపడుతున్నారు. దగ్గుబాటి సీనియర్ నేత అయినా ఆయన పార్టీలు తరచుగా మారుతారని పేరు ఉంది.  తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీలు మార్చిన దగ్గుబాటి ఇపుడు ఈ పార్టీని కూడా వీడిపోతే ఆయన రాజకీయంగా విరమించుకోవాల్సిందేనని కూడా టాక్ నడుస్తోంది.


మరి దగ్గుబాటి జగన్ భేటీ అయితే అన్ని విషయాలు సామరస్యంగా సమసిపోతాయని అంటున్నారు. కానీ ఈ భేటీ జరుగుతుందా, లేక దగ్గుబాటి పార్టీకి గుడ్ బై కొడతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎపిసోడ్ ఇపుడు ఏపీలోనూ, వైసీపీలోనూ హాట్ టాపిక్ గా ఉందని అంటున్నారు.    దీనికి తొందరలోనే తెర పడుతుందని కూడా అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: